భారీ స్థాయిలో రాజమండ్రిలో టీడీపీ మహానాడు
ఈరోజు 15 వేల మంది ప్రతినిధులతో టీడీపీ మహానాడు భారీస్థాయిలో రాజమండ్రి శివార్లలోని వేమగిరిలో జరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడుతూ రాజమండ్రి గొప్పతనాన్ని వర్ణించారు. మహానటుడు ఎన్టీఆర్ మెచ్చిన నగరం రాజమహేంద్రవరమని, ఇక్కడ తెలుగు జాతికి, తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన ఎంతోమంది గొప్పవాళ్లు నడయాడారని పేర్కొన్నారు. తెలుగుదేశం జెండాలోని పసుపు శుభప్రదమైనదని, జెండాలోని నాగలి గుర్తు రైతన్నను గుర్తు చేస్తుందని ఆనాడే ఎన్టీఆర్ ముందుచూపుతో ఈ పార్టీ జెండాను రూపొందించారన్నారు. సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్లని ఎన్టీఆర్ చెపుతూ ఉండేవారని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మరిచిపోదని పేర్కొన్నారు.

సామాన్యప్రజల వాహనమైన సైకిల్‌ను గుర్తుగా పెట్టారని తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి జరుగుతున్న ఈ సంవత్సరం ఇలాంటి సభలు జరగడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నారు. తెలుగుదేశం కార్యకర్తల త్యాగాన్ని మరిచిపోమన్నారు. ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో అభివృద్ధి రివర్స్ చేస్తోందన్నారు. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదని, ముఖ్యమంత్రి జగన్ పనుల కారణంగా అమరావతి అభివృద్ధి చెందలేదన్నారు. మూడురాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడుతున్నారని, పోలవరాన్ని ముందుకు సాగనీయడం లేదని విమర్శించారు. ఈ సభలో ఎన్నికల ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెప్తున్నారు.