Andhra PradeshHome Page Slider

నేడు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి దాదాపు నెల రోజులపైనే అవుతుంది. అయితే ఈ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేమని పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. కాగా దీనిపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.  ఈ క్రమంలోనే చంద్రబాబు ఈ కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే ఈ క్వాష్ పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు బెయిల్ కోసం దాదాపు 3 కోర్టులను ఆశ్రయించినప్పటికీ ఆయనకు ఇప్పటికీ బెయిల్ లభించలేదు. దీంతో టీడీపీ పార్టీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే చంద్రబాబు అరెస్ట్ గురించి చర్చించేందుకు వారు ఇవాళ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. ఈ మేరకు ఇప్పటికే వారు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు చంద్రబాబు అరెస్ట్ ,ఇతర పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అయితే ముఖ్యంగా సెక్షన్ 17Aప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు వివరించే అవకాశమున్నట్లు సమాచారం.