ఎన్నికల మ్యానిఫెస్టో పై టీడీపీ కసరత్తు
◆ రెట్టింపు సంక్షేమ పథకాల హామీ దిశగా అడుగులు
◆ యువత, మహిళలు, రైతులే టార్గెట్
◆ అధికారం దక్కాలంటే వైసీపీ కంటే ఎక్కువ పథకాలు తేవాలి
◆ ఇదే లక్ష్యంగా ప్రణాళిక రూపొందిస్తున్న టీడీపీ
ఏపీలో రానున్న ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీల మనుగడకు అత్యంత కీలకమైనవి కావటంతో ఇరు పార్టీలు పక్కా ప్రణాళికలతో పటిష్టమైన కార్యాచరణను రూపొందించుకుంటూ అడుగులు వేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా గడువు కొన్ని నెలలు మాత్రమే ఉండటంతో… ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తమ స్పీడును పెంచి సార్వత్రిక పోరుకు సిద్ధమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో సత్తా చాటి పూర్వవైభవాన్ని పొందాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఎన్నికలప్పుడు కాకుండా ఇప్పుడే మేనిఫెస్టో రూపకల్పన దిశగా చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అధికార పార్టీ ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలే తమను తిరిగి అధికారంలోకి వచ్చేలా చేస్తాయన్న ధీమాలో ఉన్న నేపథ్యంలో టీడీపీ కూడా రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే అంతకుమించిన సంక్షేమ పథకాలను అందిస్తేనే అధికారం సాధ్యమన్న భావనలో ఉంది.
ముఖ్యంగా టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ ఎత్తివేస్తారని అధికార పార్టీ నేతలు పదేపదే చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సమగ్ర వ్యూహాలను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే పథకాల కన్నా ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలను అందిస్తామన్న హామీతో ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు వ్యూహరచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలపై చంద్రబాబు దృష్టి పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఏ అంశాలకు సంబంధించి సంక్షేమ అజెండాను అమలు చేయాల్సి ఉంటుందో వాటిపైనే ఎక్కువ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల దగ్గర నుంచి యువత, విద్యార్థులు, మహిళలు, ఇతర రంగాల కార్మికులు ఆశిస్తున్న అంశాలపై ఇప్పటికే అధ్యయనం ప్రారంభించినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రధానంగా యువత, మహిళలను ఆకర్షించే విధంగా మేనిఫెస్టో రూపకల్పన చేయాలనే నిర్ణయానికి ఆ పార్టీ వచ్చింది.
మరోవైపు రైతాంగ సమస్యలు వారికి అందించాల్సిన తోడ్పాటుతో పాటు పట్టణవాసులకు ఇవ్వాల్సిన హామీలపై టీడీపీ ఒక అధ్యయనం కూడా ప్రారంభించిందని అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు సీనియర్ నేతలతో పలుమార్లు మంతనాలు జరిపి మేనిఫెస్టోను పక్కాగా ప్రజలను ఆకర్షించే విధంగా ప్లాన్ చేస్తున్నారని , అన్ని వర్గాల ప్రజలకు సమతుల్యమైన సంక్షేమాన్ని ఇతర పథకాలపై స్పష్టమైన హామీలు ఇచ్చే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని, ఎన్నికలకు ఆరు నెలలు ముందే మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వైసీపీ అమలు చేసే సంక్షేమ పథకాలకు దీటుగా చంద్రబాబు ఎలాంటి సంక్షేమ పథకాలను ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో పెడతారో ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరి చంద్రబాబు హామీ ఇచ్చే సంక్షేమ పథకాలు ఈసారి ఎన్నికల్లో ప్రజలను ఆకర్షిస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది.