ఉమ్మడి మేనిఫెస్టోతో జనంలోకి వెళ్లనున్న టీడీపీ, జనసేన
ఈ నెల 9న టీడీపీ కేంద్ర కార్యాలయంలో జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ
త్వరలో ఉమ్మడి విస్తృతస్థాయి సమావేశం
అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్నా దృఢమైన సంకల్పంలో టీడీపీ, జనసేన
ఏపీలో రానున్న ఎన్నికల్లో ఎలాగైనా విజయాన్ని సాధించి అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న దృఢమైన సంకల్పంతో పనిచేస్తున్న తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడిగా ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఇప్పటికే రెండు పార్టీల మధ్య సమన్వయానికి జాయింట్ యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేసిన ఆ పార్టీల అధినేతలు ఇక ఉమ్మడి కార్యాచరణ మేనిఫెస్టో కామన్ మినిమం ప్రోగ్రాం రూపకల్పనలపై దృష్టి పెట్టారు. తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీ రాజమండ్రిలో తొలి సమావేశాన్ని నిర్వహించి యాక్షన్ ప్లాన్ ను రూపొందించింది. ఈ నేపథ్యంలో రెండో సమావేశానికి జనసేన తెలుగుదేశం పార్టీలు సిద్ధమయ్యాయి. ఈనెల 9న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి ఆరుగురు సభ్యుల చొప్పున మొత్తం 12 మంది నేతలు హాజరు కానున్నారు.

ఇక తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో తో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరిట ఆరు పథకాలతో మినీ మేనిఫెస్టోను ప్రకటించింది. దసరా పండుగ నాడు పూర్తి మేనిఫెస్టోను విడుదల చేయాలని భావించినప్పటికీ అనుకోని పరిస్థితులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్ళటంతో ఇది కాస్త వాయిదా పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జైల్లో చంద్రబాబును కలిసి పొత్తుల ప్రకటన కూడా చేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు పార్టీలు ఉమ్మడి మానిఫెస్టోను విడుదల చేయాలన్న ఏకాభిప్రాయానికి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ పాలసీకి జనసేన ఆమోదముద్ర వేసింది. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన షణ్ముఖ వ్యూహం మేనిఫెస్టోకు సంబంధించిన ఆరు అంశాలను ప్రతిపాదించారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన ఆరు అంశాలను కూడా జోడించి ఉమ్మడి మేనిఫెస్టో తో త్వరలోనే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు జనంలోకి వెళ్ళనున్నాయి.

ఇంకోవైపు ఉమ్మడి విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు కూడా రెండు పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు ఆయా పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయి. చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడ్డాక కంటి శస్త్ర చికిత్స పూర్తయి విశ్రాంతి అనంతరం ఈ సమావేశాన్ని జరపాలని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యాయ చట్టపరమైన చిక్కులతో పాటు ఇతర సాంకేతిక అంశాలు ముడిపడి ఉండటంతో వీటన్నింటిపై న్యాయ నిపుణులతో తెలుగుదేశం పార్టీ చర్చలు జరుపుతోంది. ఒకటి రెండు రోజుల్లో న్యాయ సలహా అనంతరం ఈ ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.