‘తిరుపతి గంగమ్మజాతర’కు తమిళనాడు అరుదైన గౌరవం..
తిరుపతి పట్టణంలో గ్రామదేవత గంగమ్మ జాతరను ప్రతీఏటా మే నెలలో వైభవంగా జరుపుకుంటారు. ఈ జాతరను చూడడానికి తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాదు తమిళనాడు నుండి కూడా జనం తండోపతండాలుగా వస్తారు. ఈ జాతరకు తమిళనాడు ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. అదేంటంటే ‘గంగజాతర’ అనే పుస్తకాన్ని పదోతరగతి తెలుగు రీడర్‌లో పాఠ్యాంశంగా చేర్చారు. తమిళనాడులో కొన్ని స్కూళ్లలో తెలుగు మీడియం కూడా ఉంది. అలాగే తెలుగు ఆప్షనల్ సబ్జెక్టుగా కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ పుస్తకాన్ని తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి రాశారు. ఈ జానపద సాహిత్యాన్ని ఆదరించిన స్టాలిన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు ప్రొఫెసర్. ఈ జాతర 1వ శతాబ్దం నుండి జరుగుతోందని ప్రజలు నమ్ముతారు. తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి సోదరిగా, తిరుపతి గ్రామదేవతగా గంగమ్మను ఆరాధిస్తారు భక్తులు. జాతర జరిగే వారం రోజుల పాటు నగరమంతా సందడిగా ఉంటుంది. భక్తులు విచిత్ర వేషాలతో అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది.