తమిళనాడులో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సిద్ధం:సీఈసీ
తమిళనాడులో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. మరో వారంలో రాష్ట్రంలో ఈ సవరణ ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం మద్రాస్ హైకోర్టుకు శుక్రవారం తెలియజేసింది.
2026లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ చర్య చేపట్టబోతున్నారు. దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఇప్పటికే వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లో ఓటరు జాబితాలు నవీకరించి, డూప్లికేట్, మృతులు, మారిన ఓటర్ల వివరాలను తొలగించి, కొత్త ఓటర్లను చేర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు.
ఇక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న బిహార్‌లో ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అక్కడ 22 ఏళ్ల విరామం తర్వాత ఈ సవరణ చేపట్టడం విశేషం. అయితే ఆ రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ అమలు వివాదాస్పదమైంది. విపక్షాలు దీనిపై తీవ్రంగా స్పందించాయి. ఎస్‌ఐఆర్ పేరుతో భారీ స్థాయిలో బిహార్‌లో ఎన్నికల రిగ్గింగ్ జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా వేలాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తోందని ,ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచే విధంగా ఓటర్లను తొలగించడం అంగీకారయోగ్యం కాదు. ప్రజల స్వరాన్ని అణచివేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఓటరు జాబితా సవరణ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని, ప్రతి రాష్ట్రంలో ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్ లేదా స్థానిక బూత్‌లెవల్ అధికారుల ద్వారా ధృవీకరించుకోవచ్చని స్పష్టం చేసింది.తమిళనాడులో ప్రారంభమయ్యే ఈ సవరణ ప్రక్రియలో కొత్తగా 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. తప్పుడు వివరాలు లేదా పునరావృత పేర్లను తొలగించేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు సమాచారం.

