‘ఈడీ రైడ్స్’తో తమిళనాడు మంత్రులు భయపడాల్సిన అవసరం లేదు – కేజ్రీవాల్
తమిళనాడులోని డీఎంకే పార్టీ మంత్రుల ఇళ్లలో ఈడీ దాడులపై వ్యాఖ్యానించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. డీఎంకే పార్టీ మంత్రులు ఈడీ రైడ్స్‌తో భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రప్రభుత్వం బీజేపీ వ్యతిరేక పార్టీలను బెదిరించి, భయపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి పనులు చేస్తోందని విమర్శించారు. తమిళనాడు విద్యాశాఖామంత్రి పొన్నుడి, అతని కుమారుడు ఎంపీ గౌతమ్ సింగమణిపొన్‌ల ఇళ్లపై ఈడీ దాడులను కేజ్రీవాల్ ఖండించారు. బీజేపీ ప్రభుత్వం మిత్ర పార్టీలను వేరుచేసే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తోందని మండిపడ్డారు. ఈడీ, ఎన్‌డీఏ వంటి సంస్థలను ఇలాంటి పనులకు వాడుకుంటోందని విమర్శలు చేశారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే బీజేపీకి ప్రతీ పార్టీ దూరమవుతుందని, అన్నీ శత్రు పక్షాలుగా మారిపోతాయని పేర్కొన్నారు. భారత్ లాంటి గొప్ప దేశాన్ని ఈడీ దాడి లాంటి చర్యలతో భయపెట్టలేరని ఆయన పేర్కొన్నారు.
ఈ దాడుల విషయంలోతమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో ఈడీ దాడులకు డీఎంకే భయపడే ప్రసక్తే లేదన్నారు. కేవలం కుట్ర పూరితంగానే ఈ దాడులు జరుగుతున్నాయని సీఎం ఆరోపించారు. అందుకే ఎప్పుడో 13 ఏళ్ల క్రితం కేసులో ఇప్పుడు సోదాలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేకే కేంద్ర సంస్థలతో సోదాలు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే మనీలాండరింగ్ ఆరోపణలతో మంత్రి పొన్నుడి నివాసాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.