ఎడతెరిపిలేని భారీవర్షాలతో తమిళనాడు అతలాకుతలం
మిచౌంగ్ తుఫాను బెడద వదిలిందనుకుంటే తమిళనాడును భారీ వర్షాలు చుట్టుముట్టాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. ప్రధాన రహదారులన్నీ కాలువలుగా మారాయి. దక్షిణ తమిళనాడులోని తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్కాసి జిల్లాలను వరద ముంచెత్తింది. పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుండి నీరు చేరడంతో ఈ జిల్లాలలో వరద బీభత్సం ఏర్పడింది. దీనితో లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లు నీట మునిగాయి. అక్కడి జిల్లాలలో నేడు విద్యాసంస్థలుకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా తమ కార్యకలాపాలు నిలిపివేశాయి.

పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనితో ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లరాదని సూచనలు చేశారు. తూత్తుకుడిలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తమిళనాడు వ్యాప్తంగా వందేభారత్ సహా 17 రైళ్లు రద్దయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లను అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లకు సిద్దం చేయాలని ఆదేశించారు.

