కొరడాతో కొట్టుకున్న బీజేపీ అధ్యక్షుడు
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై తనను తాను కొరడాతో కొట్టుకున్నారు. కోయంబత్తూర్ లోని ఆయన నివాసంలో మీడియా ఎదుటనే ఎనిమిది కొరడా దెబ్బలతో తన శరీరాన్ని గాయపరుచుకున్నారు. ఆయన కొరడా ఝుళిపించుకోవడంతో జర్నలిస్టులు, కెమెరామెన్లు విస్తుపోయారు. అసలు ఎందుకు ఆయన ఇలా చేశారంటే.. ఇటీవల అన్నా యునివర్సిటీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన ఇలా చేశారు. ఆకుపచ్చ లుంగి ధరించి, అన్నామలై ఒక పొడవాటి, తెల్లటి కొరడాతో బహిరంగంగా కొరడాలతో కొట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు డీఎంకేను దించే వరకు తాను చెప్పులు వేసుకోనంటూ అన్నామలై నిన్న శపథం చేసిన విషయం తెలిసిందే. . అన్నా యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన విషయంలో అన్నామలై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాష్ట్రంలో పిల్లలు, స్త్రీలకు భద్రత లేదు. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినవాడు డీఎంకే వ్యక్తే. ఈ డీఎంకేను అధికారం నుంచి దించేవరకూ చెప్పులు కూడా వేసుకోను. రేపటి నుంచి 48 రోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నాను” అని స్పష్టం చేశారు.

