టీనేజ్ పిల్లలనూ పట్టించుకోండి..
సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో పదేళ్ల వయస్సు వచ్చే వరకూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ టీనేజ్‌కి వచ్చాక, కాలేజీ చదువులు చదివేటప్పుడు అంత శ్రద్ధ వహించరు. కానీ వారి పట్ల మరింత శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. వారు ఎదుగుతున్నారు. వాళ్లకన్నీ తెలుసు అని కొందరు తల్లిదండ్రులు అనుకుంటారు. మరికొందరు తల్లిదండ్రులు వారు చెడుదారులు పడతారేమో, చదువుపై శ్రద్ధ తగ్గుతుందేమో అని అతి జాగ్రత్తకు పోయి, అనేక ఆంక్షలు పెడుతూ ఉంటారు. ఈ రెండు పద్దతులూ మంచిది కాదంటున్నారు సైకాలజిస్టులు.

పిల్లలు కౌమార దశలోకి వచ్చాక కాస్త స్వతంత్రంగా వ్యవహరించాలనుకుంటారు. కొన్ని సొంతనిర్ణయాలు తీసుకుంటారు. దీనితో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. ఇలా జరగకుండా వారికి తగిన స్వేచ్ఛనిస్తూ నియంత్రణలో పెట్టడం మంచి పద్దతి. ముందుగా పిల్లలు వారి ఆలోచనలు పెద్దవారితో చెప్పడానికి భయపడే పరిస్థితులు ఉండకూడదు. వారు ఏ విషయమైనా పంచుకునేలా వారితో స్నేహంగా వ్యవహరించాలి. ముందుగా వారు చెప్పే మాటలు వినాలి. నీకేం తెలీదు, చిన్నపిల్లవి అనకూడదు. నాకన్నీ తెలుసు అని ప్రతీ టీనేజ్ పిల్లలూ అనుకుంటారు. అందుకే వారితో ఆవేశంగా మాట్లాడకుండా, మంచేదో, చెడేదో విడమర్చి చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే వారిలో లోపాలను ఎత్తి చూపొద్దు. పదే పదే ప్రతీ విషయంలో కలుగజేసుకుంటూ సలహాలు ఇవ్వకూడదు. వారి సమస్యలు సామరస్యంగా తెలుసుకుని, పరిష్కారానికి సహాయం చేస్తే చాలు. వారంతట వారే ప్రతీ విషయం మీతో పంచుకుంటారు. వారి అభిప్రాయాలకు మీరు విలువనిస్తే, మీ అభిప్రాయాలకు వారు కూడా విలువనిస్తారు.