ఆందోళనలతో వేడెక్కిన తాడికొండ
ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఉండవల్లి శ్రీదేవి..డొక్కా మాణిక్య వరప్రసాద్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఆందోళనలతో తాడికొండ ఉడికి పోతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రగిలి పోతోంది. ఒకరికొకరు ఎదురు పడితే చాలు నినాదాలతో పరిసరాలను హోరెత్తిస్తున్నారు. శ్రీదేవి వర్గానికి చెందిన కార్యకర్తలు ర్యాలీకి సిద్ధమవుతుండగా.. అక్కడకు డొక్కా రావడంతో పరిస్ధితి ఒక్కసారిగా వేడెక్కింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి సద్ది చెప్పేందుకు ప్రయత్నించారు. సమస్యలు ఉంటే మీరూ మీరూ పరిష్కరించుకోండి అంతే కానీ ఇలా రోడ్లను బ్లాక్ చేసి ఆందోళన చేయడం సరికాదంటూ హితవు చెప్పారు. ర్యాలీలకు అనుమతి లేదని అన్నారు. అనుమతి ఇవ్వాల్సిదే అంటూ శ్రీదేవి వర్గం పోలీసులపై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నం చేసింది. అయితే వారికి అనుమతి ఇస్తే తామూ ఆందోళనకు దిగుతామని డొక్కా వర్గం కూడా తెగించడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.
