ఢిల్లీకి టీ కాంగ్ నేతలు.. ఈడీ నోటీసులే అజెండా
నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు అందుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. పార్టీకి, అనుబంధ సంఘాలకు విరాళాలిచ్చిన కొందరు నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు అందుకున్న నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, తనయుడు రాహుల్ గాంధీని ఈడీ సుదర్ఘంగా విచారించింది. ఈడీ విచారణ కక్షపూరితమంటూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలతో దేశంలోని ఈడీ కార్యాలయాల ముందు నిరసనలు తెలిపారు. మొత్తం కేసును పర్యవేక్షిస్తున్న ఢిల్లీ పెద్దలు.. కేసు విచారణ జరగుతున్న తీరు.. అనుసరించాల్సిన పద్దతులను నేతలకు వివరించేందుకు ఢిల్లీ పిలిపించినట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీకి కొందరు నేతలు రాగా.. రేపు మరికొందరు నేతలు ఢిల్లీ చేరుకుంటారు. మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు ఈడీ నోటీసీలు జారీ చేసింది.
