Andhra Pradesh

వైసీపీలో మరో కీలక నేతపై సస్పెన్షన్ వేటు

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయ ఢంకా మోగించాలని వైసీపి ఉవ్విళ్లూరుతోంది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను విజయ తీరాలకు చేరుస్తాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి చోటా నేతల వరకు గట్టిగా నమ్ముతున్నారు. 175 కి 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని వైఎస్ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నేతలు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇంఛార్జిలు గడపగడపకు తిరుగుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్లలో ప్రభుత్వం చేసిన మేలును ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు. పనిలో పనిగా ప్రతి ఇంటికి అందిన సంక్షేమ పథకాల పాంప్లెట్‌ను కూడా ప్రజల చేతుల్లో పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే వారి పైన చర్యలు మొదలు పెట్టారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై వేటు వేస్తున్నారు.

ఇప్పటికే ఇలా నర్సాపురం మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడును , కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణను సీఎం జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన డీవై దాస్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. కాగా డీవై దాస్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా వర్ల రామయ్యకు ఇచ్చింది. దీంతో వైసీపీ తరఫున పోటీ చేసిన ఉప్పులేటి కల్పన నెగ్గారు. ఆ తర్వాత ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మళ్లీ 2019 ఎన్నికల తర్వాత డీవై దాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు డీవై దాస్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత సీఎం జగన్ ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే కాకుండా త్వరలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కొంతమంది నేతలను కూడా వైసీపీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారని సమాచారం.