Andhra PradeshHome Page Sliderhome page slider

సస్పెన్షన్‌ మరో మూడు నెలలు పొడిగింపు

అమరావతి: ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ సస్పెన్షన్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లినట్టు నిర్ధారణ కావడంతో ఇప్పటికే ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సస్పెన్షన్ గడువు ముగియబోతుండటంతో రివ్యూ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

సునీల్‌కుమార్‌పై ఉన్న కేసులు కీలక దశలో ఉన్నాయని రివ్యూ కమిటీ స్పష్టం చేసింది. సస్పెన్షన్ ఎత్తివేస్తే సాక్ష్యాధారాలు ప్రభావితం అవ్వచ్చు,దర్యాప్తు దిశ మార్చబడే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడింది.దీనితో సీఎస్ విజయానంద్‌ సస్పెన్షన్‌ ఆదేశాలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్ల నిధుల దుర్వినియోగానికి సంబంధించి సునీల్‌కుమార్‌పై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఆయన పాత్రపై అనేక అంశాలు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

గతంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై వేధింపుల కేసులోనూ సునీల్‌కుమార్‌పై గుంటూరు నగరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు కేసులు కీలక దశలో ఉన్నాయని, విచారణలో విఘాతం కలగకుండా ఉండేందుకు సస్పెన్షన్ పొడిగించాల్సిన అవసరం ఉందని రివ్యూ కమిటీ అభిప్రాయపడింది.

దీనితో సునీల్‌కుమార్‌పై తదుపరి పరిపాలనా చర్యలు తీసుకోవాలని డీజీపీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ పరిణామాలతో సునీల్‌కుమార్ సస్పెన్షన్ వ్యవహారం మరింత కాలం కొనసాగనుందని స్పష్టమైంది.