InternationalNews

సూర్యకుమార్‌ సునామీ.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ భారత్‌ వశం

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో ట్వంటీ20 క్రికెట్‌ మ్యాచ్‌లో భారత స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ సునామీ సృష్టించాడు. అతడు కేవలం 22 బంతుల్లోనే 61 పరుగులు చేయడంతో భారీ స్కోర్ల ఈ మ్యాచ్‌లో భారత్‌ అద్భుత విజయం కైవసం చేసుకుంది. దీంతో మూడు ట్వంటీ20 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ భారత్‌ వశమైంది. క్రీజ్‌ వదిలి ముందుకొచ్చి పిచ్‌పై నృత్యం చేస్తున్నట్లుగా అతడు కొట్టిన షాట్‌ నేరుగా వెళ్లి ప్రేక్షకుల గ్యాలరీల్లో పడుతోంది. పిచ్‌కు దూరంగా వెళ్తున్న వైడ్‌ బంతికి బ్యాట్‌ను తాకిస్తే గ్రౌండ్‌ను చీల్చుకుంటూ వెళ్లి బౌండరీ లైన్‌ దాటుతోంది. నడుం కంటే ఎత్తులో వచ్చిన బౌన్సర్‌ను అలాగే లేపితే స్టాండ్స్‌లో పడింది. షార్ట్‌ పిచ్‌ బంతిని వికెట్‌ వెనక్కి ఆడితే నేరుగా బౌండరీ అవతల పడింది.

ఏ బౌలర్‌ వేసినా.. ఎలాంటి బంతిని విసిరినా బౌండరీ లైన్‌ దాటించడమే ఏకైక లక్ష్యంగా సూర్యకుమార్‌ ఆడటం విశేషం. ఏదో సుడి ఉన్నట్లు ఆడుతున్న అతడికి బంతులు ఎలా వేయాలో అర్ధం కాక సఫారీ బౌలర్లు తలలు పట్టుకున్నారు. కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, కోహ్లీ కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ కూడా 28 బంతుల్లోనే 57 పరుగులు (5 ఫోర్లు, 4 సిక్సర్లు) చేయడం విశేషం.

238 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాలపాలైంది. అయినా మిల్లర్‌ 47 బంతుల్లో 106 పరుగులతో (8 ఫోర్లు, 7 సిక్సర్లు) నాటౌట్‌గా నిలిచినప్పటికీ జట్టును గట్టెక్కించలేకపోయాడు. మిల్లర్‌తో కలిసి చివర్లో డికాక్‌ (69 నాటౌట్‌) ఎంతగా ప్రయత్నించినా విజయానికి దక్షిణాఫ్రికా 16 పరుగుల దూరంలోనే నిలిచింది. క్రికెట్‌ అభిమానులకు పరుగుల కనువిందు చేసిన ఈ మ్యాచ్‌లో విజయంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు మైదానంలోకి పాము రావడంతో ఆటకు కొంతసేపు అంతరాయం కలిగింది.