వరంగల్ ఎంజీఎంలో దారుణం
వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఎంజీఎం వైద్యులు చేసిన చికిత్స వికటించి 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. చెన్నారావు పేట మండలం పాపయ్యపేటకు చెందిన వీహాన్‌ను ఎముక సర్జరీ నిమిత్తం ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఈ ఎముక సర్జరీ వికటించడంతో వీహాన్ మృత్యువాత పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సర్జరీ చేసే సమయంలో వైద్యులు వీహాన్‌కు హైడోస్ అనస్తీషియా ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వరంగల్ ఎంజీఎం ఎదుట వీహాన్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

