వైద్యుల భద్రతపై సుప్రీం కీలక సూచనలు
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యచార ఘటనతో దేశంలోని వైద్యులందరూ నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తున్న సుప్రీంకోర్టు వారి భద్రత విషయంలో ఆసుపత్రులకు కీలక సూచనలు చేసింది. నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులకు తిరిగి విధుల్లో చేరాలని సూచించింది.
ఆసుపత్రులకు వైద్యుల భద్రత దృష్ట్యా కొన్ని మార్గదర్శకాలు ఖరారు చేసింది. అవేంటంటే..
ఎయిర్ పోర్ట్, మెట్రో ట్రైన్ తరహాలో బ్యాగేజి స్కానింగ్ నిర్వహించాలి. ఎలాంటి ప్రమాదకర వస్తువులు ఆసుపత్రిలోకి ప్రవేశించకుండా చూడాలి.
పేషెంట్లు తప్ప వచ్చే అటెండర్లు, విజిటర్ల సంఖ్యపై నియంత్రణ ఉంచాలి. పరిమితిని విధించాలి.
ఆసుపత్రి ప్రాంగణంలో తగినంత వెళుతురు ఉండాలి. సీసీ కెమెరాలను అమర్చాలి.
అత్యవసర సేవల విభాగాల వద్ద అధిక భద్రతను సమకూర్చాలి.
వైద్యులకు ఫేస్ రికగ్నైజేషన్ కల్పిస్తూ, రెస్ట్ రూమ్‌లు ఏర్పాటు చేయాలి.
రాత్రి 10 నుండి తెల్లవారి 6 గంటల వరకూ డ్యూటీ చేసే మహిళా వైద్యుల కోసం రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలి.
పోష్ యాక్ట్ ప్రకారం మహిళా సిబ్బంది కోసం అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి.
పనిచేసే ప్రదేశంలో సురక్షిత వాతావరణం కల్పించడం యాజమాన్యాల బాధ్యత. మహిళలకు రక్షణ ఇవ్వలేకపోతే, వారికి ఉద్యోగం చేసే అవకాశాన్ని పోగొట్టినట్లే. సమానత్వాన్ని తిరస్కరించినట్లే. వైద్యుల భద్రత కోసం ఈ నియమాలను రూపొందించినట్లు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌తో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యానించింది. మహిళా వైద్యుల భద్రత కోసం మూడు వారాలలోగా నివేదిక ఇవ్వాలని కమిటీని నియమించింది. వారి కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

