ఢిల్లీ కోచింగ్ సెంటర్ కేసుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థుల మృతిపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మృతిపై కేసును సుమోటోగా తీసుకుని విచారించాలని నిర్ణయించింది. ఆ కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్ వద్ద వరదనీరు సెల్లార్‌లోకి ప్రవేశించి, బయటకు రాలేక ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇంకా విద్యార్థుల ఆందోళనలు చేస్తున్నారు. సెల్లార్లలో కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు నిర్వహించడం, డ్రైనేజ్ సిస్టంలో లోపాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో కారు ఆరోడ్డుపై వెళ్లిన కారణంగా సెల్లార్‌లోకి నీరు ప్రవేశించిందంటూ ఒక కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. వ్యవస్థలోని లోపాలపై దృష్టి పెట్టకుండా, రోడ్డుపై వెళ్లిన కారు డ్రైవర్‌ను అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారించనుంది.

