గ్రూప్-1 పరీక్షలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్..
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాసేపట్లో పరీక్షలు ప్రారంభం కానున్న సమయంలో జోక్యం చేసుకోలేమని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్షను వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలని పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించి సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. పరీక్షల వాయిదాకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సైతం ధర్మాసనం నిరాకరించింది. సుప్రీం తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. పరీక్షలు యథావిధంగా జరగనున్నాయి. దీంతో షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్- 1 మెయిన్స్ పరీక్ష ప్రారంభం అయ్యాయి. మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం ఇవాల్టి నుంచి 27వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. 31,383 మంది అభ్యర్థులు హాజరుకాబోతున్న ఈ పరీక్షల కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని భారీ బందోబస్తు మధ్య 46 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. అన్ని ఎగ్జామ్ సెంటర్ల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు.