వీధికుక్కలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
వీధికుక్కల తరలింపు విషయంలో దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ నెల 11వ తేదీన జారీ చేసిన ఆదేశాలను మరోసారి విశ్లేషించి, విస్తృత ధర్మాసనం సవరించింది. వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్లలో ఉంచరాదని.. కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లో ఉంచాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టొద్దని పేర్కొంది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసి వదిలేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో అన్నిరాష్ట్రాల సీఎస్ లకూ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ నుంచి వీధికుక్కలను తరలించాలంటూ ఈ నెల 11వ తేదీన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేక షెల్టర్లకు తరలించి వాటి బాగోగులు చూసుకోవాలని, అవి మళ్లీ జనావాసాల్లో కనిపిస్తే సంబంధిత అధికారులపై కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించిది. అదే సమయంలో.. ప్రజల ప్రాణాలు పోతున్నాయని, జంతు హక్కుల పరిరక్షకులు.. జంతు ప్రేమికులు వీధి కుక్కల తరలింపును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని, వాళ్ల వాదనలు వినే ఉద్దేశం కూడా తమకు లేదని తీవ్ర వ్యాఖ్యలే చేసింది. దీంతో తీవ్ర దుమారం రేగింది. అయితే ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఆ తీర్పును పునఃసమీక్షిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. ఈలోపు ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఆగస్టు 14వ తేదీన విచారణ జరిపింది. ఇరువైపుల నుంచి పోటాపోటీ వాదనలే జరగ్గా.. తీర్పును బెంచ్ రిజర్వ్ చేసింది. మనుషులకు కుక్కల వల్ల పడుతున్న బాధ, మరోవైపు జంతు ప్రేమికుల ఆందోళనలు రెండూ పరిగణనలోకి తీసుకుని ఈ తీర్పు వెల్లడించినట్లు పేర్కొంది ధర్మాసనం.