ఉచితాలపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఉచితాలపై ప్రకటనలు చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి, ఏం రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసం ఓటర్లకు ఉచితాలను పంపిణీ చేయడానికి పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను నియంత్రించాలంటూ అడ్వకేట్ అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ఉచిత హమీల అంశాన్ని తేల్చేందుకు ఓ కమిటీ వేయాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఉచితాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కొందరు అంటున్నారు. మరికొందరేమో అవన్నీ సంక్షేమ పథకాలని చెబుతున్నారు. అందుకే ఈ అంశం సంక్లిష్టంగా మారుతోందని చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు ఉచిత హమీలు ఇవ్వకుండా మేం అడ్డుకోలేం. అయితే ఉచిత హామీలు ఒక్కటే ఎన్నికల్లో గెలుపును నిర్ణయిస్తాయని చెప్పడం సరికాదన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాలు పౌరులు గౌరవంగా జీవించేందుకు దోహదపడుతున్నాయని అన్నారు. ఉచితాలపై చర్చించి సూచనలు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

