స్త్రీ, పురుష సమానత్వంపై కేంద్రానికి సుప్రీం ప్రశ్నలవర్షం..
స్త్రీ, పురుష సమానత్వం అంటే మహిళలు, పురుషులకు సమాన అవకాశాలు ఇవ్వడం కాదు..అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అర్హత ఉంటే అవకాశం ఇవ్వాల్సిందే.. అంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. భారత సైన్యంలోని జడ్జి అడ్వకేట్ జనరల్ బ్రాంచీ పోస్టుల్లో మహిళా అధికారులు తక్కువగా ఉండడంపై అసహనం వ్యక్తం చేసింది. రఫేల్ లాంటి యుద్ధ విమానాలే నడుపుతున్నారు మహిళలు. వారికి లీగల్ పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదు అంటూ కేంద్రానికి ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ పోస్టుల కోసం జరిగిన పరీక్షలలో అష్నూర్ కౌర్, ఆస్థ త్యాగీ అనే మహిళా అధికారులు 4, 5 ర్యాంకులు సాధించారు. అయినప్పటికీ వారికి పోస్టులు కేటాయించలేదు. మహిళల కోటాల్లో ఖాళీలు లేవంటూ ఎంపిక చేయలేదని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపి, కేంద్రప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. తీర్పును రిజర్వు చేసింది.