Andhra PradeshHome Page Slider

అమరావతి పై నేడు సుప్రీం లో విచారణ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయగణం చూపు ఢిల్లీ వైపు మళ్ళింది. అమరావతి పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనున్న నేపథ్యంలో పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ధర్మాసనం ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో అన్న ఉత్కంఠత సర్వత్త నెలకొంది. ఒకవైపు ప్రభుత్వం అమరావతి కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని పిటిషన్లు వేసిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఎప్పటిలాగానే విచారణ జరగనుంది. అమరావతి కేసుతోపాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన కేసులను కూడా ఒకే బెంచ్ విచారిస్తోంది. జస్టిస్ నాగరత్నం జస్టిస్ జోసఫ్ లతో కూడిన ధర్మాసనం ఇప్పటివరకు విచారణ చేస్తూ వచ్చింది.

ఈ క్రమంలో ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో ఉన్న ఇబ్బందులను పిటిషన్లు అఫిడవిట్లు ద్వారా కోర్టుకు విన్నవించింది. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ఇది ఎంతో ఆర్థిక భారంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి 2000 కోట్లతోనూ జరుగుతోందని దీనితో ఎంతో ఆర్థిక వ్యత్యాసం ఉన్నట్లుగా స్పష్టం చేసింది. మరోవైపు అమరావతి రైతులు తమ వాదనలు కోర్టు దృష్టికి ఇప్పటికే తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఇచ్చిన హామీలు రాతపూర్వక పత్రాలు అన్నిటిని కోర్టుకు సమర్పించడంతోపాటు హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను సైతం న్యాయమూర్తులకు తమ న్యాయవాదుల ద్వారా వినిపిస్తూ వస్తున్నారు.

అనేక వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కేసు ఇప్పుడు మళ్ళీ తెరపైకి రావటం కొంత ఆసక్తిని రేకెత్తిస్తుంది. గత విచారణ సమయంలో ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కూడా కొంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. రాజ్యాంగపరమైన అంశాలు ఈ కేసులో ఉన్నట్లుగా న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ధర్మాసనం ముందుకు రాబోతున్న అమరావతి కేసు విచారణ అనంతరం నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే ఆసక్తి ఇటు ప్రభుత్వం అటు అమరావతి రైతులలో నెలకొంది.