‘మేకిన్ ఇండియా’ నినాదంతో తయారైన సూపర్ డ్రోన్ ‘తపస్’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ సహాయంతో నడిచే శక్తివంతమైన స్వదేశీ సూపర్ డ్రోన్ ‘తపస్’. యుద్ధవ్యూహాలు ప్రతీ సంవత్సరం మారిపోతున్నాయి. పెద్దపెద్ద విమానాలు, యుద్ధ ట్యాంకర్లు, మిసైల్స్‌తోనే కాదు. చిన్న చిన్న డ్రోన్‌లు కూడా మేమున్నామంటూ రయ్యని దూసుకుపోతున్నాయి. దేశీయ పరిజ్ఞానంతో మేకిన్ ఇండియా నినాదంతో DRDO వారు తయారు చేసిన ఈ తపస్ డ్రోన్ అలాంటిదే. దీనిపేరు తపస్ BH-201. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించారు శాస్త్రవేత్తలు. టేకాఫ్, ల్యాండింగ్ అంతా కూడా మనిషితో సంబంధం లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ సహాయంతో జరిగిపోతూంటుంది.

నిజానికి దీని తయారీ 2016లోనే మొదలయ్యింది. అప్పట్లో దీనిని రుస్తుం-2 అనేవారు. అనేక మార్పులు,చేర్పులతో అధునాతన రూపు దిద్దుకుంది. ఇది 30 వేల అడుగుల ఎత్తుకు ఎగురగలదు. 1000 కిలోమీటర్ల వరకూ నిర్విరామంగా ప్రయాణించగలదు. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా వెళ్లగలదు. వర్షం వచ్చినా, తుఫాన్‌లు వచ్చినా ప్రయాణం చేయగలదు. ఇది శత్రు స్థావరాలకు వెళ్లి నిఘా పెట్టి, దాడి చేయగలదు. 15 వేల అడుగుల ఎత్తు నుండి శత్రు దేశాల ఆయుధాలను కనిపెట్టి నాశనం చేయగలదు. దీనిపొడవు 11 మీటర్లు ఉంటుంది. దీనిని సున్నితమైన, సమస్యాత్మక ప్రదేశాలలో దీనిని ఉపయోగించవచ్చు. ఈమధ్యనే వీటి ప్రయోగం విజయవంతమైంది. ఇటువంటి 500 డ్రోన్లను భారత సైన్యంలో ప్రయోగించబోతున్నారు. ఇది 300 కిలోల బాంబులను మోసుకొని వెళ్లగలదు. దీనిని సైనికులు వెళ్లడానికి కష్టమైన ప్రదేశాలకు ఈజీగా పంపవచ్చు. మంచు చరియలు, పర్వత ప్రాంతాలు, సముద్రం పైనా చాలా సులువుగా వెళ్లి దాడి చేయగలదు ఈ సూపర్ డ్రోన్.

