గగనతలానికి సునీతా గుడ్‌బై
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ 27 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి ముగింపు పలుకుతూ రిటైర్మెంట్ ప్రకటించారు. గతేడాది డిసెంబరు 27 నుంచే సునీత పదవీవిరమణ అమల్లోకి వచ్చిందని నాసా నిర్వాహకురాలు జారెడ్ ఐజాక్‌మన్ విలియమ్స్ వెల్లడించారు. 60 ఏళ్ల వయసులో కెరీర్‌కు గుడ్‌బై చెబుతూ “నా జీవితానికి ఇది చాలనిపిస్తోంది” అని సునీత విలియమ్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 27 ఏళ్లు హ్యోమగామిగా, అంతరిక్షంలో 608 రోజులు, తొమ్మిది స్పేస్‌వాక్‌లు , ఏ మహిళా వ్యోమగామి అందుకోలేని ఎత్తులు , ఇవన్నీ సునీతా విలియమ్స్ సాధించిన ఘనతలుగా నాసా ప్రకటించింది . అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో మూడు మిషన్లను విజయవంతంగా పూర్తి చేసి, నాసా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన వ్యోమగాముల్లో ఒకరిగా నిలిచారు. ఆమె ఎందరో యువ వ్యోమగాములకు ఆమె మార్గదర్శకురాలయ్యారు. రెండు దేశాలకు కీర్తి పతాకగా నిలుస్తూ, అంతరిక్ష రంగంలో ఎన్నో అరుదైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.
1965 సెప్టెంబర్ 19న ఒహాయోలో జన్మించిన సునీతా… భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లోవీన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీల కుమార్తె. పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం కాగా , సునీత చిన్న కుమార్తె. గుజరాత్‌లో జన్మించిన దీపక్ పాండ్యా 1958లో అమెరికాకు వలస వెళ్లారు. అక్కడే సునీత విద్యాభ్యాసం పూర్తి చేసి, నాసా ఎత్తుకు ఎదిగారు.
రికార్డులన్నీ ఆమెవే. 1998లో నాసాకు ఎంపికైన సునీతా , 27 ఏళ్ల పాటు సేవలందించారు. మూడు అంతరిక్ష యాత్రల్లో పాల్గొని, భూమికి దూరంగా నింగిలో మొత్తం 608 రోజులు గడిపారు. నాసా చరిత్రలో అత్యధిక కాలం అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల్లో రెండో స్థానంలో నిలిచారు. మహిళా వ్యోమగామిగా అత్యధికంగా తొమ్మిది సార్లు స్పేస్‌వాక్‌లు చేసి (62 గంటల 6 నిమిషాలు) అరుదైన రికార్డు నెలకొల్పారు. అంతరిక్షంలో మారథాన్ రన్ చేసిన తొలి వ్యక్తిగా కూడా చరిత్ర సృష్టించారు.
సునీత 2024లో పట్టుదలకు చిరునామాగా నిలిచిన ఘట్టం చోటుచేసుకుంది. కేవలం వారం రోజుల మిషన్‌గా వెళ్లిన సునీతా , సాంకేతిక సమస్యల కారణంగా 286 రోజులు అంతరిక్షంలోనే ఉండిపోయారు. బోయింగ్ స్టార్‌లైనర్ మిషన్‌లో బుచ్ విల్‌మోర్‌తో కలిసి తొమ్మిది నెలలపాటు శూన్యంలో జీవించారు. భారరహిత స్థితి, పరిమిత ఆక్సిజన్, తినడం నుంచి నిద్ర వరకు ప్రతిదీ సవాలే. 59 ఏళ్ల వయసులో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని, అనుభవంతో కూడిన సంయమనం, అపారమైన ధైర్యంతో భూమికి తిరిగొచ్చారు.
సమస్యలకు వెన్నుచూపని దృఢచిత్తం, భవితపై నమ్మకం సునీతా విజయానికి మూలాధారాలు. “మనసే మన నేస్తం… అదే మన శత్రువు కూడా” అన్న గీతా సందేశాన్ని ఆచరణలో పెట్టి, మనసును బుద్ధిని అదుపులో పెట్టుకుని విజయం సాధించిన మహిళ సునీతా విలియమ్స్. గగనతలానికి ఆమె గుడ్‌బై చెప్పినా , ఆమె ప్రేరణ స్పేస్ కు సంబంధించి తరతరాలకు దిక్చూచి అవుతుంది.

