Telangana

ఈటల మల్లయ్యకు సునీల్ బన్సల్ నివాళి

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్ ఇవాళ ఈటల నివాసానికి వచ్చారు. ఇటీవల ఈటల తండ్రి మల్లయ్య మరణం తర్వాత ఈటలకు బన్సల్ సంఘీభావం ప్రకటించారు. మల్లయ్యకు బన్సల్ అంజలి ఘటించారు. అంతకు ముందు షామీర్ పేట్ ఈటల నివాసంలో సునీల్ బన్సల్‌కు ఈటల ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత ప్రదీప్ రావుతోపాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.

బీజేపీ వ్యూహాలకు దిట్టగా బన్సల్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. యూపీలో బీజేపీ వరుసగా రెండుసార్లు విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఆయనకు తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. అంతే కాకుండా బెంగాల్, ఒడిశా బాధ్యతలు సునీల్ బన్సల్ నిర్వర్తిస్తున్నారు. కీలక రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించిన బీజేపీ హైకమాండ్… తాజాగా ఆయనను మిషన్ 2024 నలుగురు కోర్ టీమ్‌లో సభ్యుడ్ని చేసింది. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, బన్సల్ నాయకత్వంలో బీజేపీ వచ్చే రోజుల్లో అఖండ విజయాలు సొంతం చేసుకుంటుందని ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు.