తెలంగాణకు సునీల్ బన్సాల్
తెలంగాణపై బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా కన్పిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయతీరాలకు చేర్చాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా ఉన్న సునీల్ బన్సాల్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా పార్టీ నియమించింది. బన్సాల్ నియామకం తక్షణం అమల్లోకి వస్తోందని పార్టీ స్పష్టం చేసింది. సునీల్ బన్సాల్… తెలంగాణతోపాటు ఒడిశా, పశ్చిమబెంగాల్ మూడు రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు.

సునీల్ బన్సాల్ ఏబీవీపీ కార్యకర్తగా తిరుగులేని గుర్తింపు పొందారు. పార్టీకి సుశిక్షితుడైన కార్యకర్తగా వ్యవహరించారు. 2014 ఎన్నికలకు ముందు నుంచి ఆర్ఎస్ఎస్ తరపున పార్టీకి క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. యూపీలో బీజేపీ చారిత్రత్మక విజయాల్లో సునీల్ బన్సాల్ కీలకపాత్ర పోషించారు. నాడు యూపీ లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయతీరాలకు చేరడానికి… అమిత్ షాతో కలిసి పని చేశారు. 2014 లోక్ సభసభ ఎన్నికలు, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహకర్తగా బన్సాల్ వ్యవహరించారు. బీజేపీ గెలుపు కోసం అనునిత్యం పనిచేశారు. దేశమంతటా బీజేపీ బలపడేందుకు పార్టీకి అనేక సూచనలు చేస్తూ పార్టీ పెద్దల గుర్తింపు, మన్ననలు పొందారు.

ఇటీవల తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరించిన మంత్రి శ్రీనివాసులుకు బన్సాల్‌తో సుదీర్ఘ పరిచయం ఉంది. 35 ఏళ్ల పాటు ఇద్దరూ విద్యార్థి ఉద్యమాల్లోనూ, ఇటు ఆర్ఎస్ఎస్‌లోనూ కీలకభూమిక వహించారు. దశాబ్దాల పాటు దేశమంతటా తిరిగి పార్టీ ఆలోచనా విధానాలను ప్రచారం చేశారు. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ తెలంగాణలో పార్టీకి గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. మంత్రి శ్రీనివాస్‌తో బన్సాల్‌కు ఉన్న స్నేహం పార్టీకి ఉపయోగపడుతుందన్న అభిప్రాయం ఉంది. ఇద్దరూ సుదీర్ఘకాలం మిత్రులు కావడం వల్ల తెలంగాణలో బీజేపీకి మరింత ఊపు వస్తోందని కార్యకర్తలు భావిస్తున్నారు.

యూపీలో బీజేపీ విజయం సాధించడంలో క్రియాశీల పాత్ర పోషించిన బన్సాల్… 2023లో తెలంగాణలోనూ బీజేపీ విజయం సాధించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయ్. తెలంగాణ బీజేపీకి బన్సాల్ రాక ఊపు తీసుకొస్తుందని పార్టీ హైకమాండ్ సైతం భావిస్తోంది. అందుకే పార్టీ పెద్దలు బన్సాల్‌ను ఏరికోరి తెలంగాణకు పంపించారు. తెలంగాణపై సీరియస్ ఫోకస్ పెట్టిన అమిత్ షా… ఇప్పుడు బన్సాల్‌ను రంగంలోకి దింపడం వెనుక భారీ స్కెచ్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే పూర్తి స్థాయిలో సమూల ప్రక్షాళన చేయాలని హైకమాండ్ యోచిస్తోంది.

ఆర్ఎస్ఎస్ ప్రచారక్ జీవితాన్ని విరమించుకొని బీజేపీ అఖిలభారత ప్రధాన కార్యదర్శిగా బన్సాల్‌ను పార్టీ చీఫ్ జేపీ నడ్డా నియమించారు. ఈసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు సునీల్ బన్సాల్‌కు పశ్చిమబెంగాల్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల బాధ్యతలు అప్పగించడమంటే ఆషామాషీ కాదు. మూడు రాష్ట్రాల్లోనూ బలమైన ప్రభుత్వాలు.. బలహీన విపక్షాలు ఉండటంతో.. పార్టీకి మరింత ఊపు తీసుకొచ్చేలా కార్యాచరణ అవసరమని పార్టీ భావించి… బన్సాల్‌ను నియామించినట్టు తెలుస్తోంది.


