Home Page SliderTelangana

టీఎస్‌ఆర్‌టీసీ ప్రయాణికులకు సమ్మర్ ఆఫర్

గ్రేటర్ హైదరాబాద్ వాసులకు శుభవార్త. బస్సుల్లో ప్రయాణించేవారికి టికెట్ ధరల భారం ఈ వేసవిలో తగ్గనుంది. వేసవి సెలవుల సందర్భంగా నగర సందర్శన చేయాలనుకునేవారు స్నేహితులు, బంధువులతో చక్కర్లు కొట్టొచ్చు. హైదరాబాద్‌లో ఎక్కడ నుండి ఎక్కడికైనా సులభంగా కావల్సిన బస్సులు ఎక్కుతూ ప్రయాణించే సదుపాయం గల టి-24 టికెట్ ధరను 10 శాతం తగ్గించింది. దీనితో 24 గంటలపాటు నగరమంతా తిరగొచ్చు. 100 రూపాయల టికెట్ ధర ఈ వేసవిలో 90 రూపాయలకే రానుంది. ఇక సీనియర్ సిటిజన్లయితే 80 రూపాయలకే ఈ టికెట్ లభిస్తోంది. ఈ కొత్తధరలు గురువారం (ఏప్రిల్ 27) నుండి అమలులోకి వస్తాయి. మహిళలు, వృద్ధులకోసం టి-6 అనే టికెట్‌ను కూడా ప్రారంభించారు. దీనిధర 50 రూపాయలు. దీనితో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ ప్రయాణం చేయవచ్చు. ఎఫ్-300 అనే టికెట్‌తో 24 గంటలపాటు నలుగురు ప్రయాణం చేయవచ్చు. సిటీ పరిధిలోని ఆర్డినరీ, మెట్రో కండక్టర్ల వద్ద ఈ టికెట్ అందుబాటులో ఉంటుంది.