NationalNews

కాంగ్రెస్ వంద తప్పులపై సుదర్శన చక్రం

ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత పదాలు ఉపయోగించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రధాని నరేంద్ర మోదీని “భస్మాసురుడు” అంటూ కర్నాటక కాంగ్రెస్ నేత ఉగ్రప్ప కామెంట్ చేయడంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రధానిపై ‘రావణ్‌’ అంటూ దూషించిన నేపథ్యంలో అదే తరహాలో… మరో నేత విమర్శ ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడమన్నది కాంగ్రె‌స్‌ పార్టీకి స్టైల్‌గా, ఫ్యాషన్‌గా మారిపోయిందన్నారు. కాంగ్రెస్ దుర్మార్గపు పార్టీగా మారిపోయిందని సంబిత్ పాత్ర ధ్వజమెత్తారు.

జి-20 అధ్యక్ష పదవిని భారతదేశం చేజిక్కించుకున్నందున తన “స్నేహితుడు” మోదీకి అండగా ఉంటానని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా గుర్తు చేసిన సంబిత్ పాత్ర.. ప్రపంచమంతా మోదీని కీర్తిస్తుంటే… కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ సిగ్గు రాలేదన్నారు. ఓవైపు ప్రపంచం మొత్తం నరేంద్ర మోదీతో నిలుస్తుంటే… కాంగ్రెస్ మాత్రం మోదీని విమర్శించేందుకు దారులు వెదుక్కుంటుందని దుయ్యబట్టాడు. ఇతిహాసం మహాభారతాన్ని గుర్తు చేస్తూ… కాంగ్రెస్ పార్టీ… మోదీపై వంద దూషణలు చేసేవరకు చూస్తారని.. ఆ తర్వాత హస్తం పార్టీని… గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా అంతం చేయడానికి ప్రజలు శ్రీకృష్ణుడిలా ‘సుదర్శన చక్రాన్ని’ ప్రయోగిస్తారన్నారు. ప్రజలకు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రధాని మోడీ లాంటి వ్కక్తి ఎప్పుడూ కూడా భస్మాసురుడు కాలేడన్నారు సంబిత్ పాత్ర.