Home Page Sliderhome page sliderInternational

విజయవంతంగా…రష్యా ఏకంగా 52 ఉపగ్రహాలు

రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకేసారి 52 ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా ప్రయోగించింది. వోస్టోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి సోయుజ్-2.1b వాహక నౌక ద్వారా కక్ష్యలో సోమవారం ప్రవేశపెట్టింది. భూమి ఉపరితలాన్ని ఫోటోలు తీసి, డిజిటల్ మ్యాప్‌లను రూపొందించడంలో సహాయపడనున్నాయి. అగ్నిప్రమాదాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను పర్యవేక్షించేందుకు సైతం ఉపయోగపడనున్నాయి. కనీసం ఐదేళ్ల పాటు పనిచేసేలా ఈ ఉపగ్రహాలను రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రూపొందించింది. ఈ 52 ఉపగ్రహాలలో ఏఐఎస్‌టీ-2టీ సిరీస్‌కు చెందిన రెండు ఉపగ్రహాలు ప్రధానం కాగా, యూఏఈకి చెందిన QMR-KWT-2 విద్యా ఉపగ్రహం కూడా ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి పంపారు.

రష్యా, యూఏఈ, కువైట్ మధ్య సహకారాన్ని పెంచడంతో పాటు అరబ్ దేశాల్లో అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తిని పెంపొందించడం, అమెచ్యూర్ రేడియో బ్రాడ్‌కాస్టింగ్ సేవలు అందించడం ఈ ఉపగ్రహం ముఖ్య ఉద్దేశమని స్పుత్నిక్స్ గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు.

ఇదిలాఉండగా, సముద్రంలో నౌకల కదలికలను గుర్తించేందుకు రష్యా తన శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS) వ్యవస్థను మరింత విస్తరించనుంది. పదుల సంఖ్యలో క్యూబ్‌శాట్ 3U ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చూతూ, శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీని పరీక్షించేందుకు సిట్రో-టీడీ ఉపగ్రహాలను ప్రయోగించినట్లు సంస్ధ ప్రకటించింది.