తెలంగాణలో జోరందుకున్న బీసీ వాదం
తెలంగాణ ఇప్పుడు సంధి దశకు చేరుకొంది. దశాబ్దాల తరబడి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడగా.. ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడుతోంది. తెలంగాణ ఎందుకోసం వచ్చింది? ఎవరి కోసం వచ్చిందన్నదానిపై ఇప్పుడు బడుగు బలహీనవర్గాలు ఆలోచన చేస్తున్నాయ్. తెలంగాణలో 90 శాతానికి పైగా బడుగుల, బలహీనవర్గాల జనాభా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జనాభా తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇక ఎస్సీ, ఎస్టీల పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక బీసీలు 55 నుంచి 60 శాతం వరకు ఉన్నారని అధికార పార్టీ నాయకులే చెబుతున్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలంటూ వచ్చిన తెలంగాణ ఇప్పుడు ఎవరి పాలైంది.. ప్రత్యేక రాష్ట్రం వల్ల ఎవరికి మేలు జరిగిందన్నదానిపై ఫుల్ క్లారిటీ వస్తోంది. ప్రత్యేక రాష్ట్రంలో ఎవరికి మేలు జరిగిందంటే టక్కున చెప్పడానికి ఒక్క ఫ్యామిలీ పాలిటిక్స్ తప్ప మరేం కన్పించడం లేదు. రాష్ట్రం వచ్చినా, తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా ఒరిగిందేముంది? రాజకీయాధికారం ద్వారానే ఏ వర్గానికైనా అసలైన ప్రయోజనం నెరవేరుతుంది. తెలంగాణ ఏర్పాటైతే ఎస్సీని సీఎం చేస్తానని నాడు సీఎం కేసీఆర్ ఘనంగా ప్రకటించారు. కేసీఆర్ మాట నమ్మి దళితులందరూ కారు పార్టీ వైపు మొగ్గు చూపారు. కానీ రోజులు గడుస్తున్నా దళితులకు ఏమైనా మేలు జరిగిందా అంటే అదీ లేదు.

ప్రత్యేక రాష్ట్రంలో దళితులు అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఆ ఊసే మరచారు. ఇక ప్రత్యేక రాష్ట్రంలో దళితులకు అధికార పక్కనబెడితే కీలక అధికారుల నియామకంలోనూ వివక్ష కన్పించింది. దళితబంధు పథకమంటూ ఊరించి ఊసురుమన్పించిన కేసీఆర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వర్గాలు మండిపడుతున్నాయ్. బీహారీ బాబులకు రెడ్ కార్పొట్ వేసే కేసీఆర్, తెలంగాణ బడుగు, బలహీనవర్గాల అధికారులకు ఎలాంటి అవకాశాలూ ఇవ్వలేదు. అంతే కాదు ప్రత్యేక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు తప్పించి, ఆయా వర్గాల అప్‌లిఫ్ట్‌మెంట్ కోసం మాత్రం పనిచేయలేదు.

అందుకే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో ఆ వర్గాలు రాజకీయ అధికారం కోసం కొట్లాడుతున్నాయ్. వచ్చే ఎన్నికల్లో బీసీలను గుర్తించిన వారికే ఓటేస్తామంటూ పలు సామాజికవర్గాలు ప్రతినిబూతున్నాయ్. దొర మాటలు చాలంటూ నిగ్గదీసి నిలదీస్తున్నాయ్. తెలంగాణలో ఈసారి బడుగు, బలహీనవర్గాల వారికే మద్దతిస్తామంటూ పలు సామాజికవర్గాలు గర్జిస్తున్నాయ్. బీసీల్లో ఉన్న ఆక్రందన, ఆవేదనను అర్థం చేసుకున్న బీజేపీ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే, బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామంటూ ఆ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో బీసీల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తామని పేర్కొంది. దీంతో ఇప్పుడు తెలంగాణలో బీసీ వాదం బలపడుతోంది.

వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు ఓటేసేలా ఆయా వర్గాలు పిలుపునిస్తున్నాయ్. పార్టీలతో సంబంధం లేకుండా బీసీ వాయిస్ విన్పించే నేతలకు పట్టం కట్టాలని కోరుతున్నాయ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీసీ వాదం సుస్థిరం కావాలంటే అందుకు బీసీ వర్గాలన్నీ నడుంకట్టాల్సిన సమయం ఆసన్నమైంది.

