ఇమ్రాన్ అరెస్టుకు పాక్ పోలీసుల విఫలయత్నం, అడ్డుకున్న మద్దతుదారులు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు లాహోర్‌లోని ఇంటికి చేరుకోకుండా పోలీసులను ఆయన మద్దతుదారులు అడ్డుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని మద్దతుదారులు రాళ్లు రువ్వుతున్న నేపథ్యంలో పోలీసులు వాటర్ క్యానన్లు అమర్చిన పకడ్బందీ వాహనాలను ఉపయోగిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో పాకిస్తాన్ ఎన్నికల సంఘం 70 ఏళ్ల క్రికెటర్, పొలిటీషియన్… చట్టవిరుద్ధంగా విదేశీ ప్రముఖుల నుండి తనకు లభించిన బహుమతులు అమ్ముకున్నందుకు దోషిగా నిర్ధారించింది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతనిపై అవినీతి నిరోధక కోర్టులో అభియోగాలు మోపింది. పదేపదే సమన్లు పంపినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో గత వారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గత ఏడాది ప్రారంభంలో జరిగిన పార్లమెంటరీ ఓటింగ్‌లో పదవి నుండి తొలగించబడినప్పటి నుండి సత్వర ఎన్నికలు నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తిరస్కరిస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో షెడ్యూల్ ప్రకారం ఓటింగ్ జరుగుతుందని చెప్పాడు.

