కర్నాటకలో విడ్డూరం, చెట్టుకు డబ్బులు కాశాయ్..!
కాంగ్రెస్ నాయకుడి సోదరుడి ఇంటిపై దాడి
చెట్టుపై కోటి రూపాయలను సీజ్ చేసిన ఐటీ
కర్నాటక కాంగ్రెస్ నాయకుడి సోదరుడి నివాసంపై ఆదాయపు పన్ను శాఖ ఈరోజు దాడి చేసి చెట్టుపై దాచిన ₹ 1 కోటి నగదును స్వాధీనం చేసుకుంది. మైసూరులో కాంగ్రెస్ నేత అశోక్ కుమార్ రాయ్ సోదరుడు సుబ్రమణ్య రాయ్ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. రాయ్ రాష్ట్రంలోని రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పుత్తూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో కర్నాటక పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించారు. సుబ్రమణ్య రాయ్ నివాసంలో జరిపిన సోదాల్లో ఒక పెట్టెలో ప్యాక్ చేసి చెట్టుపై దాచిన నోట్ల కట్టలు కన్పించాయి. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత, ఏజెన్సీలు ₹ 110 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనాలకు సంబంధించి 2,346 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్టు కర్నాటక ప్రధాన ఎన్నికల అధికారి చెప్పారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.


