Andhra PradeshHome Page Slider

వైఎస్ జగన్‌పై రాయి దాడి… రియాక్షన్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నుదుటిపై రాయి తగలడంతో గాయపడ్డారు. ఏప్రిల్ 14, శనివారం విజయవాడలో “మేమంత సిద్ధం” బస్సు యాత్రలో జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ‘దాడి’ జరిగింది. గుమికూడిన జనానికి ముఖ్యమంత్రి బస్సుపై నుంచి అభివాదం చేస్తున్న సమయంలో ఆగంతుకుడు రాయి విసిరాడు. రాయి తగలడంతో వైఎస్ జగన్ ఎడమ కనుబొమ్మపై గాయమైంది. ఈ దాడిలో ముఖ్యమంత్రి పక్కనే నిల్చున్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా గాయమైంది. విజయవాడలో “మేమంత సిద్దం” బస్సు యాత్ర సందర్భంగా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌పై రాళ్ల దాడి జరిగినట్లు వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.

ప్రథమ చికిత్స అనంతరం సీఎం జగన్ బస్సుయాత్ర కొనసాగించారు. గాయమైనప్పటికీ జగన్ యాత్రను కొనసాగించారు. కేసరపల్లెలో 13వ రోజు మేమంత సిద్ధం యాత్రను ముగించారు. వైద్యుల సూచన మేరకు ఆయన ఇవాళ యాత్రను వాయిదా వేసుకున్నారు. ఈ ఘటన విజయవాడలోని సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్ సెంటర్‌లో చోటుచేసుకుంది. దీనిపై విచారణ జరుగుతుండగా, ప్రతిపక్ష టీడీపీ ఈ దాడికి పాల్పడిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయవాడలో మేమంతా సిద్ధం యాత్రలో ముఖ్యమంత్రి జగన్‌కు వస్తున్న భారీ స్పందన చూసి తట్టుకోలేక టీడీపీ ఈ పిరికిపంద చర్య వెనుక ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. నిందితులను పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నాం. ఇలాంటి దాడులతో ఎన్నికల్లో గెలవలేమని టీడీపీ తెలుసుకోవాలని నాయకులు చెప్పారు. మరోవైపు టీడీపీ ట్విట్టర్ ఎకౌంట్లో మొత్తం ఘటనపై విమర్శలుగుప్పించింది.

కోడికత్తి డ్రామా 2 అంటూ కూడా టీడీపీ ట్విట్టర్ ఎకౌంట్లో విమర్శలు గుప్పించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థిస్తున్నానట్టు ప్రధాని ట్వీట్ చేయగా.. టీడీపీ మాత్రం గతంలో జరిగిన విశాఖ కత్తి దాడి ఘటనను గుర్తు చేసింది. 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో ఆయనపై జరిగిన దాడి, తాజాగా జరిగిన దాడితో సానుభూతి పొందేందుకు మరో ప్రయత్నమని ప్రతిపక్ష టీడీపీ ఆరోపించింది. ఎలక్షన్స్ కు వేళాయెరా! అంటూ టీడీపీ విమర్శించింది.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థి జగన్ పై దాడిని ఖండించారు. వైఎస్‌జగన్‌పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ సంఘటనపై నిష్పాక్షికమైన విచారణను ప్రారంభించి, బాధ్యులను శిక్షించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నానన్నారు. అదే సమయంలో టీడీపీ స్పందనకు వైసీపీ సైతం అంతే ఘాటుగా స్పందించింది.

జగన్మోహన్ రెడ్డి సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఉద్దేశ్యపూర్వకంగానే దాడి జరిగితే, దానిని అందరూ కచ్చితంగా ఖండించాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి ఎడమ కన్నుపై దాడి చేసి గాయపరచడం విచారకరం, దురదృష్టకరం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదన్న ఆయన ఈసీ కఠినమైన నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం తిరు వైఎస్ జగన్‌పై రాళ్లు రువ్వడాన్ని నేను ఖండిస్తున్నాను. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదు. మనం ప్రజాస్వామ్య ప్రక్రియలో నిమగ్నమైనప్పుడు సభ్యత, పరస్పర గౌరవాన్ని కాపాడుకుందాం. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ” అన్నారు.