NationalNewsNews Alert

విద్యుత్ సంక్షోభంలో రాష్ట్రాలు..జన్కోలకు చెల్లించని బకాయిలు


రాష్టాలు సంక్షోభంలో పడ్డాయి. విద్యుత్ ను కొనుక్కోలేని స్ధితికి దిగజారాయి. బకాయిలు పెరిగాయి. కోతలు మొదలయ్యాయి. ఇప్పుడు కరెంట్ తో ముడిపడిన అన్ని పనులు మందకొడిగా సాగనున్నాయి. నిన్న మొన్నటి వరకు కరెంట్ సమస్య లేదు.. రాదు అంటూ బీరాలు పలికారు. పక్క రాష్ట్రాలతో, ఢిల్లీ నగరంతో పోటీలు పెట్టారు. కానీ.. ఇప్పుడు కోతలు మొదలయ్యాయి. ఇక కరెంట్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియని పరిస్ధితి. అసలు ఎందుకు ఈ సమస్య ఏర్పడింది.. ? దీనికి కారణాలేంటి.. ?


జరుగుతున్న వాస్తవాలకు .. చెప్పే మాటలకు పొంతన కలవని పరిస్థితులు. వారి కంటే మనమే మెరుగు. ఢిల్లీలో కరెంట్ రాదు.. ఇక్కడ కరెంట్ పోదు అంటూ ఎన్నో మాటలు విన్నాం. కానీ.. ఇప్పుడు కరెంట్ సంక్షోభంలో చిక్కుకు పోయాం. ఏపీ నుండి విడిపోయాక కష్టాలన్నీ తీరిపోయాయి. ముఖ్యంగా కరెంట్ సమస్య అన్నదే లేదు. మన కరెంట్ మనమే వాడుకుంటున్నాం. అంతే కాదు .. పక్క రాష్ట్రాలకు కూడా సరఫరా చేసే స్ధితిలో ఉన్నాం అంటూ తెలంగాణ సర్కార్ ఎన్నో చెప్పింది. ఆర్ధికంగా కూడా రాష్ట్రం మంచి స్ధితిలోనే ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేవంటూనే .. 1380 కోట్ల రూపాయల బకాయి పడింది. దీంతో కేంద్రం సీరియస్ అయ్యింది. బకాయిలు ఉన్న రాష్ట్రాలు అన్నింటికి కరెంట్ నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా .. ఓపెన్ యాక్సెస్ లో కొనడం, అమ్మడంపై నిషేధం విధించింది. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో కలిపి 13 రాష్ట్రాలపై ఆంక్షల కొరడా ఝుళిపించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో కరెంట్ కోతలు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఏపీలో తీవ్రమైన కరెంట్ సంక్షోభం కొనసాగుతోంది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇక అక్కడ కరెంట్ ముఖం చూసే పరిస్ధితి కూడా ఉండదేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి. అసలే తలకు మించిన అప్పుల భారం ఏపీని ఆందోళన పరుస్తుంటే.. ఇప్పుడు విద్యుత్ సంస్ధలకు చెల్లించాల్సిన బకాయిలు 412 కోట్ల రూపాయలకు పైనే ఉంది. ఈ సమస్య నుండి బయటపడే మార్గాలను అన్వేషించే పనిలో పడింది జగన్ సర్కార్.


కేంద్రం నిషేధించిన రాష్టాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు జార్ఖండ్, బీహార్, రాజస్తాన్, తమిళనాడు, ఛత్తీస్ ఘడ్, జమ్మూ కాశ్మీర్ , మధ్యప్రదేశ్, కర్నాటక, మణిపూర్, మిజోరాం, మహారాష్ట్ర ఉన్నాయి. వీటిలో బీజేపీయేతర రాష్ట్రాలు 8 ఉంటే.. బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు 5 ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం ఐదు వేల కోట్లకు పైగానే బకాయి పడ్డాయి. ఇందులో తెలంగాణయే అత్యధికంగా 1380 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ తర్వాత స్ధానంలో తమిళనాడు నిలిచింది. ఆ రాష్ట్రం 924 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అలాగే రాజస్తాన్ 500 కోట్లు, జమ్మూ కాశ్మీర్ 434 కోట్లు, మహారాష్ట్ర 381 కోట్లు, ఛత్తీస్ ఘఢ్ 274 కోట్లు, మధ్యప్రదేశ్ 230 కోట్లు, జార్ఖండ్ 214 కోట్లు, బీహార్ 172 కోట్లు బకాయి పడ్డాయి. ఇక బహిరంగ విపణిలో విద్యుత్ కొనుగోళ్ళు, అమ్మకాలు జరపకుండా 13 రాష్ట్రాలపై నిషేధం విధించింది. ఈ మేరకు విద్యుత్ క్రయ విక్రయాలు జరిపే నాలుగు సంస్ధలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎన్నోసార్లు బకాయిలు చెల్లించాలని ఆయా రాష్ట్రాలకు సూచనలు చేసినా.. పట్టించుకోక పోవడంతో విధిలేని స్ధితిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కేంద్రం తెలిపింది. అయినా నిర్దేశిత గడువు లోగా బకాయిలు చెల్లించని రాష్ట్రాలలో కొద్ది నెలల క్రితం సర్ ఛార్జి విధానాన్ని తీసుకు వచ్చారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. వాయిదాల గడువు కూడా ఇచ్చారు. అయినా నో యూజ్. చివరిగా నిషేధం విధించాల్సిన పరిస్ధితులను ఆయా రాష్ట్రాలే కొని తెచ్చుకున్నాయి.


అయితే తాము చెల్లించాల్సిన బకాయిలన్నీ ఎప్పుడో చెల్లించామని తెలంగాణకు చెందిన ట్రాన్స్ కో పేర్కొంది. హిరంగ విపణిలో విద్యుత్ కొనుగోళ్ళు, అమ్మకాలు నియంత్రించడానికి వీలు లేదని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపధ్యంలో కోర్టు ధిక్కార పీటీషన్లు దాఖలు చేసేందుకు ట్రాన్స్ కో సిద్ధం అవుతోంది. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు లేకపోలేదని తెలిపింది. ఇక ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు .. విద్యుత్ వినియోగదారులపై పెను భారం మోపేందుకు కూడా తెలంగాణ సిద్ధం అయ్యింది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు మోత మోగి పోతున్నాయి. దీనికి తోడు కొత్తగా మళ్ళీ పెంచనున్నారన్న ప్రచారం ఆందోళన రేపుతోంది. డిస్కమ్ లకు ఖర్చుల భారం పెరగడం వల్ల విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పని పరిస్ధితి తలెత్తుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయాలలో కొనుగోలు చేస్తూ .. డిమాండ్ తగ్గిన సమయంలో తన దగ్గర అదనంగా ఉన్న విద్యుత్ ను విక్రయిస్తూ తెలంగాణ విద్యుత్ సంస్ధలు ఎంతో లాభాలను ఆర్జిస్తున్నాయి. అయినప్పటికీ.. చెల్లించాల్సిన బకాయిలను మాత్రం చెల్లించడం లేదు. ఈ ఏడాది జులై మాసంలో విద్యుత్ బకాయిలు చెల్లించాలని ప్రధాని మోదీ కూడా అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు.


ఏపీలో విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకు పోవడానికి కారణం జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలేనని విపక్ష పార్టీలు మండి పడుతున్నాయి. గతంలో ఏ గ్రేడ్ లో ఉన్న డిస్కమ్ లను సీ గ్రేడ్ కు తెచ్చిన ఘనత జగన్ దేనని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. అలాగే తెలంగాణ నుండి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు కూడా పేరుకు పోయినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేత పట్టాభి ప్రశ్నించారు. ఈ సంక్షోభం నుండి గట్టెక్కేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మార్గాలను అన్వేషిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ మాత్రం కోర్టులోనే తెల్చుకుంటాం అన్న ధోరణిని ప్రదర్శిస్తోంది. ప్రజలపై మళ్ళీ చార్జీల భారాన్ని మోపే ప్రక్రియకు పదును పెట్ట బోతోంది.