Home Page SliderNational

తమిళనాడు కేబినెట్‌లో స్టాలిన్ కుమారుడు, ఉదయనిధి

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పెద్ద కుమారుడు ఉదయనిధి ఈరోజు కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీలో ఉదయనిధిని రైజింగ్ సన్ అంటూ పిలుచుకుంటారు. ఆయనకు క్రీడా మంత్రిగా నియమిస్తారని తెలుస్తోంది. ఉదయనిధి స్టాలిన్ చేపాక్ – తిరువల్లికేణి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. డీఎంకే కేడర్‌తోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఎంతో మద్దతు ఉంది. రాజ్‌భవన్‌లో డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధితో తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు.

45 ఏళ్ల ఉదయనిధి 2019లో పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా నియమితుడయ్యాడు. గతంలో దాదాపు మూడు దశాబ్దాలుగా స్టాలిన్ ఆ పదవిలో ఉన్నారు.2018లో తన తండ్రి కరుణానిధి మరణం తర్వాత స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడయ్యారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి విజయం సాధించడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఉదయనిధి పలు తమిళ సినిమాల్లో నటించారు. గత ఏడాది తమిళనాడు ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌లలో ఒకరిగా సత్తా చాటారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలపై విరుచుకుపడి జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు.

గత కొన్ని నెలలుగా ఉదయనిధి కేబినెట్‌లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఐతే ముందస్తుగా ఇచ్చిన మూవీ కమిట్‌మెంట్‌లను పూర్తి చేయడం కోసం ఆయన ఇన్ని రోజులు వేచి ఉన్నట్టు తెలుస్తోంది. డీఎంకే కుటుంబం నుంచి మరొకరు వారసత్వంగా మంత్రి బాధ్యతలు చేపట్టారని అన్నాడీఎంకే విమర్శించడగా… పార్టీలో కష్టపడి పనిచేసినందుకు తగిన గుర్తింపు లభించిందని పేర్కొంది. వచ్చే రోజుల్లో ఉదయనిధి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. వారసత్వ రాజకీయాలపై ఉదయనిధి గతంలోనే ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. తాను చేసే పని మాత్రమే చూడాలని… పుట్టుక గురించి కాదని తేల్చి చెప్పేవాడు. తన భవిష్యత్ రాజకీయాన్ని నిర్దేశించేవారు చేపక్ ప్రజలు మాత్రమే నంటాడు ఉదయనిధి.