హిందీ భాషపై స్టాలిన్ రచ్చ..కేంద్రమంత్రి కౌంటర్
తమిళనాడు రాష్ట్రం ఎప్పటి నుండో హిందీ భాషపై ప్రతికూలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపైనే ముఖ్యమంత్రి స్టాలిన్ విద్యార్థులపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారని కేంద్రంపై ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో జాతీయ విద్యా విధానం 2020ని అమలు చేసి, త్రిభాషా విధానాన్ని ఆమోదించేవరకూ తమిళనాడుకు సమగ్ర శిక్షా పథకం నిధులు మంజూరు చేయబోమని కేంద్ర విద్యామంత్రి ప్రకటించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులో ఎప్పటి నుండో ద్విభాషా విధానమే అమలులో ఉందని, దానిని ఆచరించడంలో రాష్ట్రం దృఢంగా ఉందని పేర్కొన్నారు. అయితే స్టాలిన్ లేఖపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ ఖాతాలో స్పందించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 భాషా స్వేచ్ఛను సమర్థిస్తోందని, విద్యార్థులపై ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదన్నారు. అలాగే విదేశీ భాషపై (ఇంగ్లీష్) అధికంగా ఆధారపడడం వల్ల దేశంలోని భాషాపరమైన మూలాలను తెలుసుకోకుండా పరిమితం చేసినట్లవుతుందని పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే ఈ పాలసీని వ్యతిరేకిస్తోందని, విద్యను రాజకీయం చేయొద్దని హితవు చెప్పారు.