త్వరలోనే నవీ ముంబైలో శ్రీవారి ఆలయం
నవీ ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి సింఘానియా గ్రూప్ ముందుకొచ్చింది. స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే ఈఓ ఏవీ ధర్మారెడ్డి, రేమండ్స్ గ్రూప్ ఛైర్మన్, ఎండీ గౌతమ్ హరి సింఘానియా సమక్షంలో మంగళవారం ఈ మేరకు ఒప్పందం ఏర్పరుచుకున్నారు.
తిరుమల: నవీ ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి సింఘానియా గ్రూప్ ముందుకొచ్చింది. స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే ఈఓ ఏవీ ధర్మారెడ్డి, రేమండ్స్ గ్రూప్ ఛైర్మన్, ఎండీ గౌతమ్ హరి సింఘానియా సమక్షంలో మంగళవారం ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. ముంబైలోని ఉల్వే ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల భూమిలో రూ.70 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని సింఘానియా చేపడతారని తితిదే ఈఓ తెలిపారు. నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించి ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పారు. సీఈ నాగేశ్వరరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, డిప్యూటీ ఈఓ సెల్వం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

