Andhra PradeshNews

ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

◆ శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ చైర్మన్ మీడియా సమావేశం
◆ పోలీసులు, విజిలెన్స్, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన చైర్మన్
◆ ఎనిమిది రోజులుగా వివిధ వాహన సేవలపై దర్శనమిచ్చిన శ్రీవారు
◆ బ్రహ్మోత్సవ రోజుల్లో శ్రీవారిని దర్శించుకున్న 5.69 లక్షల భక్తులు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. బుధవారం ఉదయం 6 గంటలకు జరిగిన చక్రస్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో అఖరి వాహనమైన అశ్వవాహన సేవ తిరుమలలో వైభవంగా జరిగింది. ఎనిమిది రోజులుగా వివిధ వాహన సేవలపై దర్శన మిచ్చిన శ్రీవారి ఉత్సవాలలో అఖరిగా సుమధురమైన పుష్పమాలికలు, ఆభరణాలు ధరించి కల్కిఆవతారంతో తిరుమలేశుడు భక్తులకు సాక్షాత్కరించారు. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన, పోలీసులు, విజిలెన్స్, సిబ్బందికి ప్రతిఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

బ్రహ్మోత్సవ రోజుల్లో 5.69 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని… వీరందరూ సర్వదర్శనం చేసుకోవడం విశేషం అని పేర్కొన్నారు. గరుడ సేవ రోజు 3 లక్షల మంది వాసనసేవలో పాల్గొన్నారని, బ్రహ్మోత్సవాల్లో 24 లక్షల లడ్డూలు విక్రయించామన్నారు. స్వామి వారి హుండీ ఆదాయం 20 కోట్ల 43 లక్షలుగా తేలిందన్నారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో చిన్నపిల్లలు తప్పిపోకుండా 1.25 లక్షలు ట్యాగులను పంపిణీ చేశామని… 2.20లక్షలకు పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారని 42 వేల గదులను భక్తులకు కేటాయించామని.. సుమారుగా 21 లక్షల మంది అన్న ప్రసాదం స్వీకరించారని వెల్లడించారు. (21 లక్షల భోజనాలు) 9 వేల వాహనాలు తిరుమలలో పార్కింగ్ చేసుకునేందుకు ఏర్పాటు చేశామని,7 రాష్ట్రాల నుండి కళాకారులు మాడవీధుల్లో ప్రదర్శనలు ఇచ్చారని, 35 టన్నుల పుష్పాలతో అలంకరణలు చేపట్టామని పేర్కొన్నారు.

పుస్తక విక్రయాల ద్వారా టీటీడీకి రూ.31 లక్షల ఆదాయం లభించిందనీ… 12638 ట్రిప్పులతో ఆర్టీసీ 3.47లక్షల మందిని తిరుమలకు చేరవేసిందని.. ఏపీలోని 26 జి‌ల్లాల నుండి 6997 మంది వెనుకబడిన ప్రాంతాల వారికి శ్రీవారి దర్శనం కల్పించామని వివరించారు. ఎల్ఈడీ స్క్రీన్లు ఎక్కువగా ఏర్పాటు చేయలేదని భక్తులు ఫిర్యాదు చేశారని… వచ్చే బ్రహ్మోత్సవాల్లో ఎక్కువగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గరుడసేవ రోజూ లేపాక్షి దగ్గర తోపులాట జరిగినప్పటికీ అధికారులు నియంత్రించారని, త్వరలోనే గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతికి తరలిస్తామని, గుజరాత్‌లో శ్రీవారి ఆలయ నిర్మానానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాలు కేటాయించిందని… త్వరలోనే భూమిపూజ నిర్వహిస్తామని చెప్పారు.