Home Page SliderNews AlertTelanganatelangana,

శ్రీశైల సొరంగం విషాదం..నిరాశలో రెస్క్యూటీమ్

శ్రీశైల ఎడమగట్టు కాలువ సొరంగంలో 8 మంది చిక్కుకుని 3 రోజులవుతున్నా వారి జాడ కానరావడం లేదు. రెస్క్యూ టీమ్ శతవిధాల ప్రయత్నిస్తున్నా, కిలోమీటర్ల మేర బురద, నీటితో నిండిపోవడంతో సహాయక చర్యలు కొనసాగలేకపోతున్నాయి. సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్, రాష్ట్ర సిబ్బంది విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. స్వయంగా మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్‌లు, స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలతో కూడా దళాలు ప్రయత్నిస్తున్నారు. లోకో ట్రైన్‌పై టన్నెల్‌లోకి వెళ్లేందుకు కొందరు సిద్దమయ్యారు. సంఘటన చోటు చేసుకున్న ప్రదేశం నుండి 3 కిలోమీటర్ల మేర బురద, నీళ్లు వెనక్కు ఎగదన్నుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ నీటిని భారీ మోటార్ల ద్వారా జలాశయంలోకి తరలిస్తున్నారు. ప్రమాదానికి గురయిన బాధితులపై ఆశలు వదులుకుంటున్నారు. వీరిలో ఉత్తరాదికి చెందినవారు ఉండడంతో  కుటుంబాలకు సమాచారం పంపించి, వారిని విమానాలలో తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. సహాయకార్యక్రమాలలో ఆర్మీ నుండి, సింగరేణి రెస్క్యూ టీం, హైడ్రా టీమ్ కూడా కలిసి వస్తున్నాయి.