ఆధ్యాత్మిక ఉత్సవం .. కార్తీక దీపోత్సవం
ఆరా ఫౌండేషన్, హెచ్ఎంటీవీల ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం, శివపార్వతుల కళ్యాణం
దీపోత్సవానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైన ప్రాంగణం
ఏర్పాట్లను పరిశీలించిన రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఆరా ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ మస్తాన్
కార్తీక మాసంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం అంటారు.. అదే ఒకే చోట.. ఓ వెలుగుల ఉత్సవం కార్తీకదీపోత్సవం జరిగితే వేలాది మంది ఒకేచోట చేరి దీపాలు వెలిగిస్తే.. అదే అసలైన ‘కార్తీక దీపోత్సవం’ అవుతుంది. దీపంను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కార్తీకమాసంలో దీపోత్సవం చేయడం ద్వారా శ్రీమహాలక్ష్మీ కరుణాకటాక్షములు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. పవిత్రమైన కార్తీకమాసంలో ప్రజలు నెల పొడవునా శివుడిని ఆరాధిస్తారు. కార్తీకమాసంలో వేల దీపాల కాంతులతో భగవంతుణ్ణి జ్యోతి రూపంలో ఆరాధిస్తే సకల కార్యాలు సిద్ధించి పుణ్యగతులు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

అలాంటి పరమ పవిత్రమైన దీప యజ్ఞాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా ఆరా ఫౌండేషన్ – హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో కార్తీక దీపోత్సవం ఈనెల 21 సోమవారం సాయంత్రం RVSCVS హైస్కూల్ గ్రౌండ్ నందు జరుగబోతోంది. ఇప్పటికే హైస్కూల్ గ్రౌండ్ సర్వాంగ సుందరంగా దీపోత్సవానికి ముస్తాబయ్యింది. ఆదివారం దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఆరా ఫౌండేషన్ చైర్మన్ షేక్ మస్తాన్, హెచ్ఎంటీవీ సీఈవో లక్ష్మీ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంపీ అయోధ్య రామిరెడ్డి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ప్రజలు భక్తులు వేలాదిగా పాల్గొని ఆ పరమశివుడి ఆశీస్సులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన ఆరా మస్తాన్‌ను ఆయన అభినందించారు.


