బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలు ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో గద్యాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ ఫిర్యాదు మేరకు తక్షణ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలకూ స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్లినట్లు సమాచారం. నోటీసులు అందుకున్న కృష్ణమోహన్ రెడ్డి స్పందిస్తూ తాను అసలు పార్టీ మారలేదని, ఇంకా బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిసానని, దాన్ని పార్టీ మారినట్లుగా చూపడం తగదని వ్యాఖ్యానించారు. ఇక, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి తదితరులు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు జూలై 31న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో స్పీకర్ మూడు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. విచారణను వాయిదా వేయరాదని, ఎటువంటి సాకులు చెప్పకూడదని స్పష్టంగా హెచ్చరించింది. ఆలస్యమైతే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకి స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.