కాంగ్రెస్ పార్టీకి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఫైనల్ ఆఫర్
ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి కలిసి పోటీ చేసే విషయమై క్లారిటీ వస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పొత్తులో ప్రతిష్టంభన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పట్టువిడుపులు చూపెడుతోంది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు ఫైనల్‌గా ఆఫర్ చేసింది. అయితే కాంగ్రెస్ ఇంకా అంగీకరించలేదు. ఇప్పటివరకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ్ యాత్రకు దూరంగా ఉన్నారు. ఇది ఉత్తరప్రదేశ్ మీదుగా కదులుతోంది. లోక్‌సభ ఎన్నికలకు సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లు పూర్తయ్యాకే ఎస్పీ యాత్రలో పాల్గొంటుందని అఖిలేష్ ఇప్పటికే తేల్చి చెప్పారు. రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న యూపీలో రెండు పార్టీలు, పొత్తుకు సిద్ధమయ్యేలా కన్పిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ మొదట కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధంగా కాగా… జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ ఎన్డీఏ కూటమిలో చేరడంతో హస్తం పార్టీకి 15 సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకరించింది. కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంకతో చర్చల తర్వాత సమాజ్‌వాదీ పార్టీ సహరాన్‌పూర్, అమ్రోహా స్థానాలను కూడా కాంగ్రెస్‌కు కేటాయిస్తానంటూ ఆఫర్ చేసింది. ఐతే కాంగ్రెస్ పార్టీ మొరాదాబాద్ లేదా బిజ్నోర్ సీటును కూడా అడిగింది. దీంతో సమాజ్‌వాదీ పార్టీ 17 సీట్లను ఇచ్చేందుకు సిద్ధమైంది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో అనేక దఫాలుగా చర్చించామని… జాబితాలను మార్చుకున్నామన్నారు అఖిలేష్ యాదవ్. సీట్ల పంపకం పూర్తయినప్పుడు మాత్రమే రాహుల్ గాంధీ న్యాయ యాత్రలో సమాజ్ వాదీ పార్టీ పాల్గొంటుందని ఆయన తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ యాత్ర మొదటి దశ ముగిసేలోపు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని అఖిలేష్ స్పష్టం చేశారు. మరో మూడు రోజుల్లో కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకోకపోతే, కూటమి విడిపోయే అవకాశం ఉంది. మిత్రపక్షాల మధ్య పోరు నడుస్తుండగా, పొత్తు గల్లంతైతే కాంగ్రెస్‌దే బాధ్యత అని సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఫక్రుల్ హసన్ చంద్ విమర్శించారు. రాహుల్, అఖిలేష్ ఇద్దరూ నేతలు సుహృద్భావ వాతావరణంలో చర్చిస్తున్నారని… యూపీలోని కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు చిల్లర వేషాలు వేస్తున్నారనియ ఆయన విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ మధ్య పొత్తును కోరుకోవడం లేదన్నారు. కూటమి విడిపోతే , కాంగ్రెస్సే బాధ్యత వహిస్తుందన్నారు. చాలా చిన్న పార్టీల కంటే కాంగ్రెస్ ఓట్ల శాతం తక్కువగా ఉందని గుర్తుంచుకోవాలన్నారు. యూపీలో ఎస్పీ, బీజేపీని సొంతంగా ఓడించగలదన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు గాను 16 స్థానాలకు యాదవ్ అభ్యర్థులను ప్రకటించి, తమ అభ్యర్థుల పేర్లను పేర్కొనడానికి కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఐదు స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక చోట గెలిచింది.

పశ్చిమ బెంగాల్‌లో పొత్తు చర్చలు పట్టాలు తప్పడంతో ఎక్కువ సీట్ల కోసం కాంగ్రెస్ ఒత్తిడి చేయడంతో ఉత్తరప్రదేశ్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కనీసం 10 సీట్లు ఇవ్వాలని పట్టుబట్టడంతో, తృణమూల్ రెండు సీట్లు ఆఫర్ చేయడంతో గందరగోళం నెలకొంది. డ్యామేజ్ కంట్రోల్ మోడ్‌లో, కాంగ్రెస్ నాయకులు మమత బెనర్జీ భారత కూటమిలో అంతర్భాగమని చెప్పారు. అయితే అధికారికంగా సీటు షేరింగ్ ఏర్పాట్లను ఇప్పటివరకు ప్రకటించలేదు. పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. పరస్పరం నిర్ణయం తీసుకున్నారని, పార్టీల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

బలమైన స్థానాల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్దపీట వేయాలని మొదట్నుంచి ఇండియా భాగస్వామ్యపక్షాలు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో బలంగా కొట్లాడిన చోట, ప్రస్తుతం బీజేపీని ఢీకొట్టాలని ఆయా పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ కేరళలో తిరిగి పోటీ చేస్తే తాము ఈసారి ఇండియా కూటమిలో ఉండబోమని ఇప్పటికే సీపీఎం తేల్చి చెప్పింది. చాలా రాష్ట్రాల్లో, బిజెపితో పోల్చితే కాంగ్రెస్ ఉనికిలో లేదని… కానీ ప్రాంతీయ పార్టీలకు ఇబ్బందికరంగా రాజకీయాలు చేయడం విడ్డూరమని ఎస్పీ మండిపడుతోంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ సీట్ల కోసం కాంగ్రెస్ ఒత్తిడి చేస్తుందని, కానీ తన బలమైన స్థానాల్లోకి వచ్చే సరికి మాత్రం ఆ పార్టీ ధైర్యం చేయలేకపోతుందని ఆయన విమర్శిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, పళ్ల బిగువుతో బీజేపీపై పోరాటం చేస్తున్నాయని… ఎన్నికల్లో వారందరూ తప్పక విజయం సాధిస్తారని అఖిలేష్ తెలిపారు. ఎన్డీయే శిబిరంలోకి మారిన తర్వాత నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కూడా కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తోంది. నిజానికి, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ “అఖిలేష్ వాఖిలేష్” వ్యాఖ్య తర్వాత ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకుంది. యాదవ్ అప్పుడు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ ఇలాగే వ్యవహరిస్తే వారిని ఎవరు నమ్ముతారు.. బీజేపీకి వ్యతిరేకంగా మనం అయోమయంతో పోరాడితే విజయం సాధించలేం” అని ఆయన అన్నారు.

