ఇడుపులపాయకు రానున్న సోనియా గాంధీ, రాహుల్
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని జులై 8వ తేదీన ఇడుపులపాయకు కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నారు. ఇప్పటికే సోనియాగాంధీ వ్యక్తిగత భద్రత సిబ్బంది ఇడుపులపాయను పరిశీలించడాన్ని బట్టి చూస్తుంటే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోనియాతో పాటు రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వైయస్సార్ ఘాట్లో నివాళులర్పించిన అనంతరం వారు వైఎస్ విజయమ్మతో భేటీ అయి చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారితో చర్చలు జరపటానికి వైఎస్ విజయమ్మ అంగీకరిస్తారో లేదో అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. విజయమ్మతో భేటీ అయ్యేందుకు అవకాశం ఉన్నా లేకపోయినా వైఎస్సార్ జయంతి కార్యక్రమానికి మాత్రం వారు హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు బలంగా చెబుతున్నాయి. తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కు కాంగ్రెస్ లో కీలక పగ్గాలు ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇడుపులపాయకు రానుండటం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.