NationalNews

సోనాలీ ఫోగాట్ మృతి కేసు సీబీఐకి అప్పగింత

సోనాలీ ఫోగాట్ మృతి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈమె భారతదేశంలో టిక్‌టాక్ స్టార్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులను అలరించిన హిందీ బిగ్‌బాస్‌ షోలో పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోనాలి ఫోగాట్ బీజేపీ నాయకురాలిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల కాలంలో గోవాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అయితే అప్పటి నుంచి ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు, ఆరోపణలు వచ్చాయి. దీంతో గోవా పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా వారు సోనాలీ ఫోగాట్ మృతికి సంబంధించి అనేక కీలక విషయాలను రాబట్టారు. అంతేకాకుండా ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఆమె స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితులను పలు మార్లు విచారించారు. అయినప్పటికీ ఆమె మృతికి అసలు కారణాన్ని వారు రాబట్టలేకపోయారు. దీంతో సోనాలీ ఫోగాట్ మృతి కేసును గోవా సీఎం సీబీఐకి అప్పగించారు. మరి ఈ సీబీఐ విచారణలో అయినా సోనాలీ మృతి వెనుక వాస్తవాలు బయటపడతాయో లేదో చూడాల్సివుంది.