Home Page SliderTelangana

‘కొందరు ఎన్నారైలకు ప్రజాస్వామ్యం విలువ తెలియదు’…కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సెటైర్

కొందరు ఎన్నారైలకు ప్రజాస్వామ్యం విలువ తెలియదంటూ కేటీఆర్‌నుద్దేశించి రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. ప్రజాస్వామ్యంలో 49 శాతానికి, 51 శాతానికి ఉండే తేడా ప్రతిపక్షం, పాలక పక్షం అన్నారు. నేటి అసెంబ్లీ సమావేశాలలో కేటీఆర్ మాటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. నాన్ రిలయబుల్ ఇండియన్ కింద కేటీఆర్ సిరిసిల్ల నియోజక వర్గంలో పాతుకుపోయారని విమర్శించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కేసీఆర్‌ను మంత్రిని చేశారని గుర్తు చేశారు. హరీష్ రావు కూడా ఎమ్మెల్యే కాకముందే అప్పటి మంత్రి వర్గంలో చోటిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. గవర్నర్ గారి ప్రసంగాన్ని తప్పుపట్టడం తప్పన్నారు. మా ప్రభుత్వంతో గవర్నర్ కుమ్మక్కయ్యారా అని మండి పడ్డారు. మీ ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసాన్నే ఆమె ప్రసంగంలో మాట్లాడాలన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించాలని ఉద్దేశం ఉంటే మాతో కలిసి రండి అని ఆహ్వానించారు. ప్రతిపక్షాలను గౌరవించే కాంగ్రెస్ సంప్రదాయాన్ని అనుసరించి మీ సలహాలు, సూచనలు స్వాగతిస్తాం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.