NewsTelangana

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

భార్య,అత్తమామల వేధింపుల తాళలేక ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజుపల్లి గ్రామానికి చెందిన కొండా రాకేష్ హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈయనకి గత 6 నెలల క్రితం వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుకుర్తి హవేలీకి చెందిన దేవులపల్లి నిహారికతో వివాహం జరిగింది. వీరి కాపురం కొన్ని నెలలపాటు సజావుగానే  సాగింది. అయితే వీరి కాపురంలో వర్క ఫ్రం హోమ్ చిచ్చుపెట్టింది.

గతకొన్ని రోజులుగా పల్లెటూరులో ఉండడం ఇష్టపడని భార్య నిహారిక హైదరాబాద్ వెళ్దామని తన భర్తతో చెప్పింది. దీనికి రాకేష్ వర్క్ ఫ్రం హోమ్ పూర్తికాగానే వెళ్దామని సమాధానమిచ్చాడు. దీని కారణంగా వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో భార్య నిహారిక పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె రాకేష్‌కు వీడియో కాల్ చేసింది. భార్య నిహారిక వీడియో కాల్‌లో మాట్లాడుతూ..రాకేష్ చనిపోవాలని అప్పుడే తాను హాయిగా రెండో పెళ్ళి చేసుకుంటానని చెప్పింది. అంతేకాకుండా రాకేష్ అత్తమామలు కూడా ఆయనను సూటిపోటి మాటలతో వేధించేవారు. దీంతో రాకేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు  పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు మృతుడి భార్యతోపాటు అత్తామామలు అరుణ,శంకర్‌పై  పోలీసులు కేసు నమోదు చేశారు.