News

ఆరోపణలు ప్రత్యారోపణలకు వేదికగా సోషల్ మీడియా

◆ ఉద్దేశ,ఉద్రేక రాజకీయాలకు కేంద్రబిందువుగా సోషల్ మీడియా
◆ మారుతున్న కాలంతో పాటు రూపుమార్చుకున్న పార్టీలు
◆ ఒకరిపై మరొకరు కించపరిచేలా వ్యాఖ్యలు
◆రాజకీయ పార్టీలకు ప్రధాన అస్త్రంగా సోషల్ మీడియా
◆ కనుమరుగవుతున్న సాంప్రదాయ రాజకీయాలు

ఒకప్పుడు రాజకీయాలు చాలా హుందాగా, సాంప్రదాయ బద్ధంగా సాగేవి. కాలంతో పాటు నాయకులు మారుతూ రాజకీయాలను భ్రష్టు పట్టించారు. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులు తాము ఏం మాట్లాడుతున్నామో అని తెలియకుండానే మాట్లాడేసి నవ్వుల పాలవుతున్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ సాంప్రదాయ రాజకీయాల రూపు మార్చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తూ అసభ్య పదజాలాలు వాడుతూ వాదోపవాదాలు ఘర్షణలకు పాల్పడుతూ కొత్త విధానానికి ప్రధాన పార్టీలు తెర తీస్తున్నాయి. మారుతున్న కాలంతోపాటు తమ ప్రవర్తనను కూడా మార్చుకుంటూ ఎవరు ఏమీ అనుకుంటే మనకు ఏంటి అన్న రీతిని వ్యవహరిస్తూ ఎవరికి వారు ఎదుటివారిని కించపరిచేల వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా మాటలు సోషల్ మీడియాలో మామూలు అయిపోయాయి.

ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు మారిపోతున్నాయి. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం సాగిన విధంగా స్వాతంత్రం స్వేచ్ఛ కోసం నినదించిన విధంగా ఇప్పుడు రాజకీయ ఆధిపత్యం అధికారం కోసం కొత్త రాజకీయానికి ఆయా పార్టీలు పాల్పడుతున్నాయని రాజకీయ పండితులు కూడా అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీ ఏదైనా ఒక విధంగా వ్యాఖ్యానిస్తే అదే రీతిన ప్రతిపక్షాలు కూడా తిప్పికొడుతుండటం పరిపాటిగా మారింది. ఎన్నికల సమీపిస్తున్న కొద్ది ఆయా పార్టీలో వాతావరణం మారింది. ఏ చిన్న సంఘటనైనా ఎవరికి వారు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ఉద్రేకపూరిత ఆరోపణల చేయడం పరిపాటిగా మారింది. ఒకప్పుడు పరోక్షంగా ఆరోపణలు చేసుకునే నాయకులు ఇప్పుడు ప్రత్యక్షంగా వ్యక్తిగతంగానే వినలేని భాషలో తిట్టుకునే స్థాయికి దిగజారారు. ఈ మధ్యకాలంలో మరొక అడుగు ముందుకు వేసి నాయకుల్లోని లోపాలతో పాటు వారి కుటుంబ వ్యవహారాలను కూడా లాగి కుటుంబ సభ్యుల్ని కూడా బజారుకీడుస్తున్నారు. ప్రతి పార్టీకి నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా కార్యకర్తలు ఉండటంతో వారి ద్వారా నియోజకవర్గ స్థాయిలో ఏ సంఘటన జరిగినా కూడా వారి మాటలను వ్యంగ్యంగా చిత్రీకరించి ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి ప్రజలలో వారిని తప్పుగా చూపించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు.

సాంప్రదాయ రాజకీయ విలువలతో ముడిపడిన రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మొత్తంగా తిట్ల పురాణాలకు చేరాయి. సోషల్ మీడియా వేదికగా చేసుకుంటున్న విమర్శలు ఒక్కోసారి శాంతిభద్రతలకు భంగం వాటిల్లేల చేస్తున్నాయి. సోషల్ మీడియా అనేది ప్రస్తుత తరానికి అసలైన వాస్తవాలు తెలుసుకోవటానికి అద్భుతమైన అస్త్రం. కానీ సోషల్ మీడియాను కూడా రాజకీయాలు కలుషితం చేశాయి. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రాజకీయ పార్టీల చీప్ ప్రచారాల వల్ల ప్రజలలో వారిపై దురాభిప్రాయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని… ఇకనైనా రాజకీయ పార్టీలు తాము చేసిన కార్యక్రమాలు, ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు, రాబోవు కాలంలో చేసే మంచి పనులు లాంటి విషయాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తెలియజేసి వారి మన్ననలు పొందాలని విశ్లేషకులు అంటున్నారు.