అగ్ని ప్రమాదానికి ఇన్ని కారణాలా..?
సికింద్రాబాద్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి కారణాలేంటి..? ఎలక్ట్రిక్ బైక్‌ల బ్యాటరీల నాణ్యతా లోపమేనా..? కనీస సౌకర్యాలు లేకున్నా లాడ్జికి అనుమతి ఇవ్వడమా..? బైక్‌ల షోరూం, హోటల్, లాడ్జిలను ఇరుకైన ఒకే భవనంలో నిర్వహించడమా..? రూబీ లాడ్జి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈ-బైక్ షోరూం ఉంది. సెల్లార్‌లో ఎలక్ట్రిక్ బైక్‌ల గోడౌన్, గ్యాస్ సిలిండర్ల గోడౌన్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో బైక్‌కు చార్జింగ్ చేస్తుండగా బ్యాటరీ పేలడం వల్లే అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీసులు చెబుతున్నారు. ఇంతకాలం రోడ్డుపై వెళ్తుండగా బైక్ బ్యాటరీ పేలిపోయిన ఘటనలు చూశాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ వల్ల ఏకంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలడంతో వ్యాపించిన మంటల కారణంగా ఇతర బైక్‌ల బ్యాటరీలు కూడా బాంబుల్లా పేలిపోయాయి. దీన్ని బట్టి ఎలక్ట్రిక్ బైక్‌ల షోరూంకు అనుమతి ఇచ్చే ముందు అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుస్తోంది. జనావాసాలకు దూరంగా.. రద్దీలేని ప్రదేశాల్లో.. అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్నిమాపక దళాలు సునాయాసంగా చేరుకునేలా విశాలమైన రోడ్లు ఉన్న ప్రాంతాల్లోనే షోరూంలకు అనుమతి ఇవ్వాలి. అంతేకాదు.. ఎలక్ట్రిక్ బైక్‌ల బ్యాటరీల నాణ్యతపైనా ప్రభుత్వం మరోసారి దృష్టి సారించాలి.

లాడ్జికి అనుమతి ఉందా..?
మరోవైపు.. ప్రమాదం జరిగిన ప్రదేశంలో హోటల్, లాడ్జిని కూడా నిర్వహిస్తున్నారు. హోటల్‌లో వంటకాల కోసం తీసుకొచ్చిన గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో తక్కువ నష్టంతో బయటపడ్డాం. సిలిండర్లు పేలి ఉంటే.. నాలుగంతస్తుల భవనం కుప్పకూలేది. అదే జరిగితే లాడ్జీలో ఉన్న 25 మంది పర్యాటకుల ప్రాణాలు ప్రమాదంలో పడేవి. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో లాడ్జికి అనుమతి ఇచ్చే ముందు మునిసిపల్, అగ్నిమాపక సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించాలి. అసలు ఈ లాడ్జీకి అనుమతి ఉందా? అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే.. మన అధికారులు ఏదైనా ప్రమాదం జరిగినప్పడు కొంత కాలం హడావుడి చేస్తారు.. తర్వాత మర్చిపోతారు.

అత్యవసర ద్వారం ఏది..?
బైక్ షోరూంలో ప్రారంభమైన మంటలు, పొగలు పైన ఉన్న రూబీ లాడ్జీలోని వ్యాపించాయి. దీంతో ఊపిరి ఆడకపోవడంతో లాడ్జీలో ఉన్న వాళ్లు ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నంలోనే అగ్నికి ఆహుతి అయ్యారు. 10 మంది పైపులు పట్టుకుని కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. మరో ఇద్దరు పైనుంచి దూకడంతో గాయాల పాలయ్యారు. అగ్ని మాపక సిబ్బంది 8 మందిని బయటకు తీసుకొచ్చారు. ఈ లాడ్జికి అత్యవసర ద్వారం లేదు. ఎంట్రీ, ఎగ్జిట్ ఒకటే ఉండటంతో లాడ్జిలోని పర్యాటకులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది చాలా ప్రమాదకరం.

అనుమతులు తీసుకున్నారా..?
ఇంత తక్కువ స్థలంలో ఇరుకైన భవనం కట్టేందుకు.. అందులో బైక్ షోరూం, హోటల్, లాడ్జి నిర్వహించేందుకు అధికారులు అనుమతి ఎలా ఇచ్చారో అర్ధం కావడం లేదు. ఫైర్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉందా..? అనే ప్రశ్న తలెత్తుతోంది. రెండంతస్తుల వరకే అనుమతి తీసుకొని నాలుగంతస్తులు కట్టారని తెలుస్తోంది. మరో ప్రమాదం సంభవించక ముందే జీహెచ్‌ఎంసీ అధికారులు ఇతర భవనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. అత్యవసర ద్వారం ఉంటేనే లాడ్జికి అనుమతి ఇవ్వాలి. హోటల్, లాడ్జిల నిర్వహణకు అది అనువైన స్థలమేనా.. ముఖ్యంగా లాడ్జి నిర్వహణకు అనుమతి తీసుకున్నారా..? తదితర విషయాలను కూడా పరిశీలించాలి.

కర్ణుడి చావుకు కారణాలనేకం..
మొత్తానికి.. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు.. ఈ ప్రమాదానికి పలు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మన అధికారుల అలసత్వం, ప్రమాణాలు పాటించకున్నా అనుమతి ఇవ్వడం వంటి విషయాలు బయట పడుతున్నాయి. ఐటీతో సహా వివిధ రంగాల్లో దూసుకెళ్తున్న హైదరాబాద్‌కు రోజూ వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది వస్తుంటారు. సికింద్రాబాద్‌లోని ఓ బేకరీలోనూ ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించి బీహార్‌కు చెందిన కూలీలు దుర్మరణం పాలయ్యారు. పాన్ ఇండియా సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ప్రతిష్ఠను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెంచాలంటే.. వారి ప్రాణాలకు మన ప్రభుత్వాలు గ్యారంటీ ఇవ్వాలి. హైదరాబాద్‌ను సురక్షితమైన నగరంగా తీర్చి దిద్దాలి. అప్పుడే వారు హైదరాబాద్‌పై నమ్మకం పెంచుకుంటారు. ప్రభుత్వం నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తే ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చు.

