Breaking Newshome page sliderHome Page SliderInternationalNews

అమెరికాలో మంచు తుఫాను.. వణికిపోతున్న 23 కోట్ల మంది

అగ్రరాజ్యం అమెరికాపై మంచు ప్రళయం ఆ దేశాన్ని వణికిస్తోంది. టెక్సాస్ నుంచి బోస్టన్ వరకు రెండు వేల మైళ్ల మేర విస్తరించిన భారీ మంచు తుఫాను తూర్పు, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. ఈ తుఫాను 23 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ హిమపాతం కారణంగా చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడటంతో వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముందస్తు జాగ్రత్తగా ప్రజలు కనీసం మూడు రోజులకు సరిపడా ఆహారం, నీరు, టార్చ్‌లైట్లు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. చికాగో, డెమాయిన్ వంటి నగరాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారీగా కురుస్తున్న మంచు, గడ్డకట్టే వర్షాల కారణంగా విద్యుత్ లైన్లు తెగిపోయే ప్రమాదం ఉందని, లక్షలాది ఇళ్లు చీకటిలో మగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్రాల గవర్నర్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

మంచు తుఫాను ధాటికి రవాణా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్ వంటి నగరాల్లో ఒక అడుగు మేర మంచు కురిసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పొగమంచు, మంచు పొరల కారణంగా రహదారులు కనిపించక మిచిగాన్ వంటి ప్రాంతాల్లో వందకు పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దుకావడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. రైలు సేవలకూ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. బయటకు వస్తే కేవలం పది నిమిషాల్లోనే చర్మం గడ్డకట్టే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈశాన్య ప్రాంతాలపై తుఫాను ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.